హైదరాబాద్, ఫిబ్రవరి 20 సిరిసిల్ల రూరల్: సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ప్రతీకార రాజకీయాలు చేస్తున్న బీజేపీపై యద్ధ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్, దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. కేంద్రప్రభుత్వంపై పోరాటంలో మద్దతు కూడగట్టేందుకు ఆదివారం చేపట్టిన ముంబై పర్యటన అసాంతం కేసీఆర్ కేంద్రంగా సాగింది. జాతీయ మీడియా, సోషల్ మీడియా మొత్తం ఇదే అంశంపై రోజంతా దృష్టి కేంద్రీకరించాయి. జాతీయ స్థాయి నాయకుల్లో ఏ ఇద్దరు కలిసినా కేసీఆర్ ముంబై పర్యటనపైనే చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ పోరాటానికి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీపై పోరాటంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన మొదటి పర్యటనే సూపర్‌హిట్ అయ్యింది. రాబోయే రోజుల్లో మరికొన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు.
ముంబై గులాబీమయం
సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ముంబై మహా నగరంలోని వీధులు గులాబీ రంగు పులుముకొన్నాయి. విమానాశ్రయం నుంచి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసం వర్ష వరకు ఎటు చూసిన కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ, జాతీయ రాజకీయాలకు మద్దతు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేసీఆర్, ఉద్ధవ్, బాల్ ఠాక్రే ఫొటోలతో ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో కేసీఆర్, శరద్‌పవార్ ఫొటోలతో హోర్డింగులు ఏర్పాటు చేశారు. దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ హోర్డింగులపై రాసిన నినాదాలు అందరినీ ఆకర్షించాయి. మహారాష్ట్రలోని తెలంగాణ పౌరులు కేసీఆర్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ముంబై వెళ్లారు. ఆయన వెంట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీలు రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, సంతోష్‌కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌రెడ్డి తదితరులు వెళ్లారు. ముంబైలో కేసీఆర్‌కు మహారాష్ట్ర నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శివసేన నేతలు సంజయ్‌రౌత్, ఆదిత్య ఠాక్రే, మహారాష్ట్ర మంత్రులు ఏక్నాథ్ షిండే, సుభాష్ దేశాయ్ తదితరులు కేసీఆర్‌ను సాదరంగా ఆహ్వానించారు. పర్యటన ఆసాంతం సినీ నటుడు ప్రకాశ్‌రాజ్.. కేసీఆర్ వెంటే ఉన్నారు. శరద్‌పవార్ ఇంటివద్ద కేసీఆర్‌కు ఎన్సీపీ నేతలు ఆత్మీయ స్వాగతం పలికి లోనికి తోడ్కొని వెళ్లారు. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ మహారాష్ట్రలోని భీవండిలో కూడా స్వాగత తోరణాలు వెలిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు నలుగొండ శ్రీనివాస్ ఫ్లెక్సీలు పెట్టి అభిమానాన్ని చాటుకొన్నారు. సోషల్ మీడియాలో కేసీఆర్ ముంబై పర్యటనను చూడటానికి నెటిజన్లు అసక్తి చూపారు. తెలంగాణతో సంబంధంలేనివారు కూడా పెద్ద ఎత్తున ఆయన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయడమే కాకుండా.. కేసీఆర్ అజెండాపై చర్చ చేపడుతున్నారు.
పెరుగుతున్న మద్దతు
కేంద్ర బడ్జెట్‌ను లోతుగా విశ్లేషించి, అందులో ఏమీ లేదని ప్రజల ముందు ఉంచిన దగ్గర నుంచీ సీఎం కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో మద్దతు పెరిగింది. బీజేపీని దేశం నుంచి తరిమివేయాలన్న కేసీఆర్ పిలుపునకు అనేక వర్గాల నాయకులు, పార్టీలు, ప్రజా సంఘాల నుంచి మద్దతు లభించింది. బీజేపీని ఎదుర్కొనడానికి కేసీఆరే సరైన నాయకుడని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీకి భయపడకుండా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించిన కేసీఆర్ తెగువ, ధైర్యం అందరినీ ఆకట్టుకున్నది. దేశవ్యాప్తంగా అనేకచోట్ల కేసీఆర్‌కు మద్దతు తెలియజేస్తూ హోర్డింగులు ఏర్పాటుచేస్తున్నారు. కేసీఆర్‌కు ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు మద్దతు తెలిపారు. మమతా బెనర్జీ త్వరలో హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యే అవకాశం ఉన్నది. త్వరలో మరికొంత మంది ప్రముఖులతో కేసీఆర్ సమావేశం కానున్నట్టు సమాచారం.