Lal Bahadur Shastri | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనొద్దని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంటనూనె తక్కువగా వాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ వేదికగా ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓవైపు దీనిపై భిన్నవాదనలు కొనసాగుతుండగా, మరోవైపు గతంలో ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలించడం మొదలు పెట్టారు. 1965లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. ఏకంగా ప్రజలను తిండి తగ్గించాలని నాటి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పిలుపునిచ్చారు. వారానికి ఒకపూట పస్తులు ఉండాలని ప్రజలను కోరారు.
1965లో భారత దేశాన్ని కరువు పట్టి పీడించింది. రుతుపవనాల వైఫల్యం కారణంగా దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటికే దేశంలో ఆహార ఉత్పత్తి తక్కువగా ఉండగా, కరువు కారణంగా దిగుబడి మరో 20 శాతం తగ్గింది. 1964లో దేశవ్యాప్తంగా 89 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగగా, కరువు కారణంగా 1965లో 72.3 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయింది. భారత దేశం ఓవైపు కరువుతో సతమతమవుతున్న సమయంలోనే పాకిస్థాన్ యుద్ధానికి కాలుదువ్వింది. కశ్మీర్‌ను ఆక్రమించుకొనేందుకు‘ఆపరేషన్ బిబ్రాల్టర్’ చేపట్టింది. దీంతో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం ఏకకాలంలో అటు కరువుతో, ఇటు పాకిస్థాన్‌తో పోరాడాల్సి వచ్చింది.
1950వ దశంలో అమెరికా ప్రభుత్వం తమ వద్ద మిగిలిపోయిన ఆహార ధాన్యాలను పేద దేశాలకు అమ్ముకొనేందుకు ‘పీఎల్-480’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆయా దేశాలు తమ సొంత కరెన్సీతో అగ్గువకు కొనుగోలు చేయవచ్చు. 1960వ దశకంలో మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉండేది. దీంతో పీఎల్-480 పథకంలో భారత్ కూడా చేరింది. అమెరికా నుంచి గోధుమలను దిగుమతి చేసుకునేది. ముఖ్యంగా కరువు ప్రారంభమైన తర్వాత అమెరికా గోధుమలు పంపితేనే పూట గడిచే దుస్థితికి చేరింది. అమెరికా నుంచి ఓడల్లో గోధుమలు రాగానే నేరుగా ప్రజలకు పంపిణీ చేసేవారు. ఆ పరిస్థితిని ‘షిప్ టు మౌత్’ అని (ఓడ నుంచి నోటికి) పిలిచేవారు. 1965 భారత్-పాక్ యుద్ధ సమయంలో అమెరికా పీఎల్-480 పథకాన్ని ఆయుధంలా వాడాలని చూసింది. వెంటనే యుద్ధం ఆపకపోతే భారత్‌కు గోధుమల పంపిణీ నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు లిండన్ బీ జాన్సన్ హెచ్చరించారు. అక్కడితో ఆగకుండా మరిన్ని ఇబ్బందులు పెట్టేందుకు గోధుమలను రోజువారీగా కాకుండా నెలవారీగా సరఫరా చేయాలని ఆదేశించారు.
ఓవైపు కరువు, మరోవైపు యుద్ధం, ఇంకోవైపు అమెరికా నుంచి గోధుమల సరఫరా తగ్గిన నేపథ్యంలో నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజలంతా వారానికి ఒక పూట భోజనం మానేయాలని పిలుపునిచ్చారు. మొదట తన కుటుంబాన్నే ఒక పూట పస్తులు ఉంచుతానని ప్రకటించారు. వారానికి ఒక పూట తిండి మానేయాలని తన కుటుంబ సభ్యులను కోరి, ఆచరించేలా చేశారు. అప్పట్లో దేశవ్యాప్తంగా హోటళ్లు, భోజన శాలలు కూడా కొన్నివారాలపాటు ఈ నియమాన్ని పాటించాయి. రాజకీయ విశ్లేషకులు 1965 నాటి ఈ ఘటనను గుర్తుచేస్తూ, ప్రస్తుతం ప్రధాని మోదీ చేసిన ప్రకటనను బేరీజు వేస్తున్నారు. దేశం ఆ స్థాయిలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదా? అని చర్చించుకుంటున్నారు.
Read Also : Rare Pics | నాగలి పట్టిన ఈ పెద్దాయన్ని గుర్తుపట్టారా.. జై జవాన్- జై కిసాన్ నినాదమిచ్చింది ఈయనే