PM Modi | హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ): ముసుగు తొలగిపోయింది. కుమ్మక్కు రాజకీయం నగ్నంగా బయటపడింది. ఇంతకాలం చీకట్లో షేక్హ్యాండ్లు ఇచ్చుకున్న కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఇప్పుడు పట్టపగలే బట్టబయలైంది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పేరుతో హైదరాబాద్‌లో జరిగిన మీటింగ్‌లో ‘నాతో వచ్చెయ్’ అని బడేభాయ్ మోదీ.. ‘మీతో ఉన్నా’ అంటూ చోటేభాయ్ రేవంత్ వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ‘మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడికి చేరలేరు.. అందువల్ల నాతో కలువండి’ అని రేవంత్‌కు మోదీ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తానొక ప్రధానమంత్రిని అని, ఇదొక బహిరంగ సమావేశమన్న స్పృహ కూడా లేకుండా ‘నేను రాజకీయాలు మాట్లాడను’ అంటూనే..మోదీ పచ్చిగా పట్టపగలు రాజకీయ బేరసారాలకు దిగారు.
పదేండ్ల పాలనలో భారత ప్రభుత్వం గుజరాత్‌కు ఎంత ఇచ్చిందో అంత ఇస్తానని ఆశ చూపారు. కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉంటాయి. వేరే పార్టీలో ఉంటే నిధులు రావు అని నేరుగానే మోదీ చెప్పేశారు. అంటే కేంద్ర నిధుల వరద గుజరాత్‌కే తప్ప తెలంగాణ వైపు రాలేదని స్వయంగా మోదీయే నిర్ధారించారు. ఇటీవలి ఎన్నికల్లో ఇండి కూటమి ఖాతాలో రెండు రాష్ర్టాలు పడి, బీజేపీకి దక్షిణాదిలో నిలువనీడ కూడా లేకుండా పోయిన నేపథ్యంలో దీన్ని ఏదో రాజకీయ ఎత్తుగడ అనుకోలేం. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎప్పటినుంచో చాపకింద నీరులా సాగుతున్న బంధం యాదృచ్ఛికంగా గుండెలు తన్నుకొని బయటకు వచ్చింది.
దీంతోపాటు సాయంత్రం జరిగిన బహిరంగ సభలో కూడా రేవంత్ సర్కార్‌ను మోదీ పల్లెత్తు మాట కూడా అనలేదు. ఈ సభకు తొలుత రాష్ట్ర బీజేపీ జనాగ్రహ సభ అంటూ పెట్టిన పేరును కూడా పీఎంవో ఆదేశాలతో మార్చేశారట. ఇవన్నీ ఈ రెండు పార్టీల అపవిత్ర కలయికనే సూచిస్తున్నాయి. ఇది చూసి రాజకీయ బేరాలు మాట్లాడుకోవడానికా మోదీ హైదరాబాద్ వచ్చింది? అని విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. రాజనీతిజ్ఞత అనేది వాట్సాప్‌లో కథలు రాయించుకొని డబ్బా కొట్టుకుంటే రాదు. పుట్టుకతో రావాలి. ఇదే స్థానంలో జవహర్లాల్ నెహ్రూ.. లాల్ బహదూర్ శాస్త్రి.. ఇందిరా గాంధీ..
రాజీవ్‌గాంధీ. .మన్మోహన్సింగ్ ఉంటే ఇంత బహిరంగంగా, ఇంత దిగజారుడు ఆఫర్ ఇచ్చేవారా? ఇదే బీజేపీకి చెందిన వాజపేయి ప్రధానిగా చేశారు. ఆయన నోట ఇలాంటి మాటలు కలలోనైనా ఊహించగలమా? వాళ్లే కాదు.. ఇదే పదవిలో చరణ్‌సింగ్, చంద్రశేఖర్, వీపీ సింగ్, దేవేగౌడ వంటి స్వల్పకాల ప్రధానులు కూడా పనిచేశారు. వాళ్లెవరైనా ఎంత ఒత్తిళ్లు ఎదురైనా తమ పదవికి ఉన్న ప్రతిష్ట, విలువలు మరిచి ఇలాంటి బహిరంగ రాజకీయ వ్యభిచారానికి దిగిన సందర్భాలున్నాయా? ఇప్పటికే భారత ప్రజాస్వామిక వ్యవస్థలను చెరబట్టి కాషాయమయం చేసి, వాటిని తోలుబొమ్మలుగా మార్చుకున్న బీజేపీ సర్కార్, ఇపుడు ప్రజాస్వామిక సంప్రదాయాలు, నైతిక విలువలను కూడా విధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టిన వైనానికి ఇది అద్దం పడుతున్నది.
ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య ఉన్న బడే భాయ్.. చోటే భాయ్ బంధం మరోసారి బయటపడింది. ప్రభుత్వ కార్యక్రమం ముసుగులో వాళ్లు రాజకీయం నెరిపారు. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆదివారం హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ, రేవంత్‌రెడ్డి ఒకరిని ఒకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. నమో అంటూ రేవంత్‌రెడ్డి పొగిడితే… ప్రధాని మోదీ ‘నాతో కలిసి పని చేయండి’ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఒక విధంగా బీజేపీలోకి ఆహ్వానించినట్టే కనిపించింది. ఓవైపు కాంగ్రెస్ అధిష్ఠానం కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ పథకాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. తద్వారా తాను బీజేపీ లైన్లోనే ఉన్నానని సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఈ ప్రశంసల పర్వంతో హెచ్ఐసీసీ వేదికగా ఇద్దరి మధ్య రహస్య బంధం బట్టబయలైంది.
తొలుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ముందు భారతదేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అని వెల్లడించారు. ‘ప్రధాన మంత్రి మోదీ వికసిత్ భారత్ 2047ను ప్రకటించినప్పుడు మేము భాగస్వాములయ్యాం. రాబోయే పదేండ్లలో మీ సహకారంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలకుంటున్నాం. మీరు సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నాం. నా రాష్ట్రం, నా ప్రజల కోసం సానుకూల నిర్ణయాల విషయంలో నేను మిమ్మల్ని, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశాను. దేశం విషయంలో మేం మీతో కలిసి ఉన్నాం. మీరు వికసిత్ భారత్ 2047పైన మాట్లాడి భారత దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపై మాట్లాడినప్పుడు, మేం మా రాష్ట్ర కోణంలో తెలంగాణ రైజింగ్ 2047ను దానికి అనుసంధానం చేశాం’ అని తెలిపారు.
‘రేవంత్ జీ మేరే సే హీ జోడో’ అంటూ ప్రధాని మోదీ అన్నారు. ‘మీరు కోరుకుంటున్న చోటుకు చేరుకోలేరు. అందువల్ల నాతో కలువండి’ అని రేవంత్‌ను ఉద్దేశించి అనడం సభికులను విస్మయానికి గురిచేసింది. తెలంగాణ అంతటా మెరుగైన మౌలిక సదుపాయాలు, నిరంతరాయ కనెక్టివిటీ దిశగా తీసుకుపోతున్నామని, దేశ ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని చెప్పుకొన్నారు. ‘రేవంత్‌రెడ్డి రాజకీయాలు మాట్లాడనన్నారు. నేను కూడా రాజకీయాలు మాట్లాడను. గుజరాత్‌కు చేసిన కేటాయింపుల కంటే రెట్టింపు తెలంగాణకు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు. గుజరాత్‌కు ఇచ్చిన నిధులను ఇస్తే తెలంగాణకు ఇప్పుడిస్తున్న నిధుల్లో సగం కూడా రావు. గుజరాత్‌కు నాడు ప్రధానిగా మన్మోహన్సింగ్ సహకరించినట్టే ఇప్పుడు తెలంగాణకు సహకరించాలంటున్నారు. అందుకు రేవంత్ మాతో జతకట్టి నడువండి. మీరు ఎకడికి చేరాలనుకుంటున్నారో అకడికి చేరుకుంటారు’ అంటూ ప్రధాని నర్మగర్భంగా పేర్కొన్నారు.