హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి, 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ డాక్టర్‌ను స్కూల్‌కు పిలిపించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత విద్యార్థులను మక్తల్ ఏరియా దవాఖానాకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న 15 మందిని మహబూబ్‌నగర్‌లో పెద్ద దవాఖానాకు తరలించారు. బుధవారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు వడ్డించారు. భోజనం తిన్న కాసేపటికే విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ కావడంతో ఉపాధ్యాయులు విద్యార్థులను బెదిరించి, ఇండ్లకు వెళ్లాలని సూచించారని, వెళ్లిన వారిలో చాలా మంది ప్రైవేటు దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారని తోటి విద్యార్థులు తెలిపారు.
డీఈవో అబ్దుల్ఘనీ స్కూల్‌కు చేరుకొని విచారణ చేపట్టారు. స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరగడం ఇది మూడోసారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డీఈవోను డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీహరి బడిని పరిశీలించారు, మక్తల్ దవాఖానాకు వెళ్లి, చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. మాగనూరు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆరా తీశారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
మాగనూర్ జెడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై మాజీమంత్రి హరీశ్‌రావు వరుస ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి కదిలారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, కుకకాట్లు, పాము కాట్లు, ఎలుక కాట్లు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.