నాంపల్లి కోర్టులు, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే నెల 16న జరిగే విచారణకు తప్పక హాజరుకావాలంటూ నాంపల్లి ఈడీ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. రేవంత్‌రెడ్డి ఏ-1 నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసు విచారణ నాంపల్లి ఈడీ కోర్టులో మంగళవారం కొనసాగింది. విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహ, వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీర య్య, సెబాస్టియన్ హాజరు కాలేదు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కోర్టు.. తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.
నిందితులు ప్రతి వాయిదాకూ హాజరుకావడం లేదని, ఇదేం పద్ధతి అంటూ జడ్జి అసంతృప్తి వ్యక్తంచేశారు. విచారణకు నిందితులు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు. వచ్చే నెల 16కు కేసును వాయిదా వేశారు. ఆ రోజు నిందితులు తప్పనిసరిగా హాజరుకావాలని నిందితుల తరుఫు న్యాయవాదిని ఆదేశించారు. ఇదిలాఉండగా నిందితుల తరుఫు న్యాయవాది గైర్హాజర్ పిటిషన్లు దాఖలు చేయడంతో కోర్టు అంగీకరించింది.
2015 మే 31న ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మరో ఎమ్మెల్యే స్టిఫెన్సన్కు నోట్ల కట్టలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్టు అభియోగాలున్నాయి. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రేవంత్‌రెడ్డితోపాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహ, సండ్ర వెంకటవీరయ్యతోపాటు రూ.50 లక్షలు సమకూర్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వేం కృష్ణకీర్తన్ తదితరులపై కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే ఓటుకు నోటు కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు గుర్తించిన ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా నాంపల్లిలోని ఈడీ కోర్టులో చార్జ్జిషీట్ దాఖలు చేసింది.
అయితే, ఈడీ కోర్టు విచారణకు నిందితులు కొంతకాలంగా హాజరు కావడం లేదు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మిగతా నిందితులు సైతం కోర్టుకు హాజరుకాకుండా, గైర్హాజరీ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. దీనిని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. నిందితులు కోర్టుకు హాజరుకాకుండా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ మండిపడింది. మరోవైపు, ఏసీబీ నమోదుచేసిన ఓటుకు నోటు కేసు విచారణ కూడా నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో కొనసాగుతున్నది. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారని, ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.