మారేడ్‌పల్లి, డిసెంబర్ 26: బీఆర్ఎస్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్‌మారేడ్‌పల్లిలోని నివాసం వద్ద బంజారాహిల్స్ పోలీసులు గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో 20 రోజుల క్రితం విధి నిర్వాహణలో ఉన్న ఇన్స్పెక్టర్, పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఉదయం 5 గంటలకు వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న లీగల్ టీం సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున మారేడ్‌పల్లికి చేరుకున్నారు. లీగల్ టీం సభ్యులు ఎర్రోళ్ల నివాసంలో పోలీసులతో చర్చించారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని చెప్పిన పోలీసులు చివరి నిమిషంలో అరెస్టు చేస్తున్నామని ప్రకటించారు.
ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేసి తీసుకెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ‘ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. దొం గల రాజ్యం, దోపిడి రాజ్యం, అక్రమ అరెస్టులు సిగ్గు, సిగ్గు’ అంటూ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎర్రోళ్లను వాహనంలో తీసుకెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు వాహనం ముందు కదలకుండా రోడ్డు పై పడుకొని అడ్డుకున్నారు. పోలీసులు నిరసనకారులను తొలగించి ఎర్రోళ్లను తీసుకెళ్లారు.
చట్టాలపై తనకు గౌరవముందని, ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుల్లో చివరికి ధర్మమే గెలిచిందని ఎస్సీ, ఎస్టీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. కోర్టునుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనకు అండగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు లీగల్‌సెల్ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు, తెల్లవారుజాము నుంచి తన వెన్నుదన్నుగా ఉన్నవారందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు నిబంధనల్ని తప్పక పాటిస్తానని తెలిపారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్నిసార్లు అరెస్టు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇది ప్రజా పాలన కాదని, దుర్మార్గమైన పాలన అని, ఈ రోజు మాట్లాడే స్వేచ్ఛ లేదని అన్నారు. అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని, ఈ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
రాష్ట్రంలో మాట్లాడే వారికి, ప్రశ్నించే వారికి స్వేచ్ఛ లేదని అన్నారు.తాను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశానని, చట్టం అంటే తనకు తెలుసని, నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొంటున్నదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు పెట్టారని, అరెస్టు చేశారని, జైళ్లకు సైతం వెళ్లి వచ్చామని ఇలాంటి కేసులు, అరెస్టులకు భయపడేది ఎవరూ లేరని, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఎర్రోళ్ల అరెస్ట్ విషయంలో పోలీసులపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసుల్ని రిమాండ్ రిపోర్టులో పేర్కొనడమేంటని, అవి 14 ఏండ్ల కిందటివని, ఆ కేసుల ద్వారా రెగ్యులర్ అఫెండర్‌గా ఎలా నిర్ధారిస్తారని 3వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఏ కుమారస్వామి గురువారం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 35(3) బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులు తీసుకునేందుకు నిందితుడు నిరాకరించాడని, తమ ఫోన్లకు సమాధానమివ్వలేదనే విషయాల్ని రిమాండ్ రిపోర్టులో ఎక్కడా పొందపర్చలేదని మాసబ్‌ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరశురామ్‌పై మేజిస్ట్రేట్ మండిపడ్డారు. రూ.5 వేల చొప్పున రెండు సొంత పూచికత్తులను కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో శ్రీనివాస్ అలాగే రెండు పూచీకత్తులు సమర్పించి అక్కడి నుంచే నేరుగా విడుదలయ్యారు. ఎర్రోళ్ల తరుఫున న్యాయవాది కిరణ్‌కుమార్ వాదనలు వినిపించారు.
హామీ అమలుపై నిలదీస్తున్న వారి గొంతులను అక్రమ అరెస్టుతో నొక్కాలని రేవంత్ సర్కారు చూస్తున్నదని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేయలేక ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చడానికి ఇలాంటి అక్రమ అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు సరికాదని మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి విమర్శించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, దళిత, బహుజన వర్గాల హకుల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారిందని విమర్శించారు.
నోటీసులు ఇవ్వకుండా కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేసే అవసరం ఏమొచ్చిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ప్రశ్నించారు. ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయడం తెలంగాణలో సర్వసాధారణమై పోయిందని మండిపడ్డారు.