హైదరాబాద్: మంత్రి కొండా సురేఖకు (Minister Konda Surekha) కోర్టు మొట్టికాయలు వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన రూ.100 కోట్ల పరువునష్టం కేసులో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది. ఓ బాధ్యత కలిగిన మహిళా మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిదని వ్యాఖ్యానించింది. అలాంటి వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని తెలిపింది. ఆమె వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇంకెప్పుడూ కేటీఆర్ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది.
దేశంలో ఇదే మొదటి సారి..
పరువు నష్టం కేసుకు సంబంధించిన ఓ కేసులో మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై కోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయటం ఇదే తొలిసారి. గతంలోనూ కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. అయినప్పటికీ మంత్రి కొండా సురేఖలో ఎలాంటి మార్పు రాలేదు. తన వ్యక్తిత్వ హననం చేసే విధంగా చేసే ఏ ఆరోపణలను సహించేది లేదని ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేశారు. ఇకపై తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి ఆయన ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కేసులో కోర్టు తాజా కామెంట్లతో కేటీఆర్ కు బలం చేకూరినట్లయింది.
కొండా సురేఖపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో కేటీఆర్ ప్రజాప్రతినిధుల కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. మంత్రి మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనకు, పార్టీ ప్రతిష్ఠకు గండికొట్టాలనే ఉద్దేశంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆమె తనపై, సాటి మహిళ సమంత మీద ఎలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిందో.. తన నోటితో కోర్టులో చెప్పలేననని అన్నారు. బహిరంగంగా (ఓపెన్ కోర్టులో) అసభ్య పదజాలాన్ని చదవడం మంచిదికాదని, ఆమె చేసిన వ్యాఖ్యలను పిటిషన్లో పేర్కొన్నట్టు విన్నవించారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడి, ప్రజలకు సేవలందిస్తునట్టు తెలిపారు. తాను ఉన్నత విద్యావంతుడినని, అమెరికాలో, భారత్‌లో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం చేశానని చెప్పారు. 2006లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న సాగుతున్న సమయంలో నెలకు రూ.4 లక్షల వేతనం సంపాదిస్తున్నప్పటికీ ఉద్యోగానికి రాజీనామాచేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు.
రాష్ట్ర ప్రజల ప్రశంసలు పొందా..
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించానని, ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి విశేష సేవలందించడంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకు అవార్డులు లభించాయని కేటీఆర్ తెలిపారు. 18 సంవత్సరాలపాటు ప్రజలతో మమేకమై మచ్చలేకుండా రాష్ట్ర ప్రజల ప్రశంసలు పొందానని చెప్పారు. తాను అందించిన సేవలకు గుర్తింపుగా మీడియా సంస్థలు సైతం ‘యంగ్ పొలిటీషియన్’ అవార్డుతో సత్కరించాయని వెల్లడించారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా ప్రజల మధ్య తనకు మంచి పేరు, ప్రతిష్ఠలున్నాయని వివరించారు.
కావాలని నిరాధార ఆరోపణలు
మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో కావాలని తనపై నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ చెప్పారు. ఆ వ్యాఖ్యలు టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియాలో ప్రసారం అయ్యాయని, ఆ వార్తా కథనాల ద్వారా సాక్షులుగా ఉన్నవారు తీవ్ర కలత చెందారని తెలిపారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారితో 18 సంవత్సరాలుగా తనకు పరిచయం ఉన్నదని, తన గురించి, గౌరవ మర్యాదల గురించి వారికి తెలుసు అని పేర్కొన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తన పరువుకు భంగం వాటిల్లిందని అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏమిటి? వాటి గురించి వివరాలు చెప్పగలరా? అని జడ్జి ప్రశ్నించారు. మహిళల పట్ల తనకెంతో గౌరవం ఉన్నదని, కొండా సురేఖ సాటి మహిళ సమంతతోపాటు తనపై చేసిన అతినీచమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలను పవిత్రమైన కోర్టులో తన నోటితో చెప్పలేనని అన్నారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఉద్దేశపూర్వకంగా నిందలు వేశారని, ఈ దుశ్చర్యలను తీవ్రంగా పరిగణించి చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. టీవీల్లో, పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో, డిజిజల్ మీడియాలో వచ్చిన వార్తాకథనాలకు సంబంధించిన క్లిప్పింగులను ఫిర్యాదు పత్రానికి జోడించినట్టు వివరించారు.