Indiramma Atmiya Bharosa | మహబూబాబాద్ రూరల్, జనవరి 29 : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఎంపిక చేయబడిన లబ్ధిదారుల జాబితాలో పలువురు మృతుల పేర్లు ప్రత్యక్షం కావడంతో మహబూబూబాద్ రూరల్ మండలం పరిధిలోని జంగిలికొండ గ్రామస్థులు అవాక్కయ్యా రు. వారిలో 12 ఏండ్ల క్రితం చనిపోయిన రైతుకూలీల పేర్లూ ఉండటంతో.. ‘ఇదేం లబ్ధిదారుల ఎంపిక.. బాబోయ్’ అంటూ గ్రామస్థులు వాపోతున్నారు.
ఇటీవల నిర్వహించిన గ్రామసభల్లో ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకంలో అర్హుల జాబితాలో చనిపోయినవారి పేర్లను అధికారులు చదివి వినిపించడంతో ఈ విషయం బయటకొచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండల పరిధిలోని జంగిలికొండ గ్రామపంచాయతీలో 2 రోజుల క్రితం నిర్వహించిన గ్రామసభలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపథకం కింద ఎంపిక చేసిన అర్హుల పేర్లను అధికారులు చదివి వినిపించారు.
జాబితాలో 12 సంవత్సరాల క్రితం చనిపోయిన కూలీలు నారాయణ, ప్రమీల పేర్లు రావడంతో గ్రామసభ విస్తుపోయింది. వారిద్దరితోపాటు మరో ఆరుగురు చనిపోయిన కూలీల పేర్లు కూడా జాబితాలో ఉండటంతో కలకలం మొదలైంది. చనిపోయిన 8 మంది పేర్లను ఆత్మీయభరోసా కింద ఎలా ఎంపిక చేశారని గ్రామస్తులు నిలదీశారు. ఉపాధి జాబ్ కార్డుల ఆధారం ఎంపిక చేశామని, అక్కడే పొరపాటు జరిగిందని అధికారులు చెప్పుకొచ్చారు. ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్, మేట్, సెక్రటరీ కలిసి చనిపోయిన వ్యక్తుల పేర్లు ఎక్కించి వారు పని చేస్తున్నట్టుగా చూయిస్తూ హాజరు వేసి డబ్బు స్వాహా చేసినట్టు గ్రామస్తులు ఆరోపించారు.