నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచే ఊపులో ఉన్నట్టున్నారు? ప్రచారం ఎలా సాగుతున్నది?
ఆల్రెడీ గెలిచిన ఊపులో ఉన్నట్టనిపిస్తున్నది. రెండు దశల ప్రచారం పూర్తి చేశినం. ఇకపై చేయబోయే ప్రచారమంతా అడిషనలే.
ఇబ్రహీంపట్నంలో పోటీ ఎలా ఉండబోతున్నది?
గత మూడు ఎన్నికల నుంచి మీరు చూస్తనే ఉన్నరు. మంచిరెడ్డి కిషన్రెడ్డి నాలుగోసారి కూడా గెలుస్తరని ప్రజలే చెప్తున్నరు. ఒకమాట క్లియర్గా చెప్తున్న. కాంగ్రెస్ అంటే కన్ఫ్యూజ్ చేసే పార్టీ. భాజాపా అంటే బాతాఖానీ తప్ప ఆందానీ చూపియ్యని పార్టీ. ఆ రెండు పార్టీలను జనాలు నమ్మడం లేదు. ఇగ పోటీ ఎకడిది?
అంటే మీ ప్రత్యర్థులు మీకు పోటీ కాదనుకుంటున్నారా?
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రకరకాల గుర్తులు పెట్టుకొని వచ్చినా.. ఇప్పటికి మూడుసార్లు ఓడగొట్టి ఇంటికి పంపిన. ఇగ బీజేపీ అంటరా..? ఇబ్రహీంపట్నం చైతన్యం ఉన్న గడ్డ. ఇకడ బ్రహ్మాండమైన ఉద్యమాలు జరిగినయ్. బీజేపీకి ఇకడ అంత సీన్ లేదు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు వర్సెస్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై మీ అభిప్రాయం ?
ఆరు గ్యారంటీలు కాదు కదా.. అందులో ఒక గ్యారంటీ కూడా అమలు చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆ నాయకులకు గానీ లేదు. అందుకు నాది గ్యారంటీ.
ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?
ముచ్చటగ మూడోసారి కేసీఆర్ సార్ అధికారంలోకి వస్తరు. నేను 30వేల మెజారిటీతో గెలుస్తా.
ఇబ్రహీంపట్నం అభివృద్ధి గురించి మీరేం చెప్తరు?
పదేండ్ల కింద ఇబ్రహీంపట్నం.. ప్రస్తుత ఇబ్రహీంపట్నం తేడా చూస్తే మీకే అర్థమవుతుంది. విశాలమైన నాలుగు లైన్ల రోడ్లు, కరెంటు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నిర్మాణంలో ఉన్న 100 పడకల దవాఖాన, అన్నీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం, స్ట్రీట్ లైట్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నయ్. గడిచిన ఏడేండ్లలో ఇబ్రహీంపట్నంకి 3వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేశినం.
నియోజకవర్గ ప్రజలకు మీ అప్పీల్ ఏంటి?
తెలంగాణకు ఏం కావాల్నో కేసీఆర్కు తెలుసు. ఇబ్రహీంపట్నంకు ఏం కావాల్నో మంచిరెడ్డికి తెలుసు. ఈ విషయం మా ఓటర్లకు బాగా తెలుసు. ఇగ నిర్ణయం వాళ్లదే.
– సుంకరి