హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): బాధితులు, కష్టజీవులు, సామాన్యుల పక్షాన నిలబడే ‘నమస్తే తెలంగాణ’ గ్రూప్-1 విషయంలో నిరుద్యోగుల గొంతుకైంది. నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తింది. లొసుగులను బయటపెట్టింది. అక్రమాలను వెలికితీసింది. వరుస కథనాలతో గ్రూప్-1 మెయిన్స్‌లో జరిగిన తప్పిదాలను వెలుగులోకి తీసుకొచ్చింది. నిరుద్యోగుల వాదనలను బలంగా వినిపించింది. గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్) విడుదలైన తర్వాత వరుసగా పరిశోధనాత్మక కథనాలను ప్రచురించింది. ఎప్పటికప్పుడు నిరుద్యోగుల గొంతుకగామారి, వారి వాదనలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. ప్రధాన స్రవంతి మరే పత్రిక కానీ, మీడియా కానీ ఈ సాహసం చేయలేదు. ఒక్క ‘నమస్తే తెలంగాణ’ మాత్రమే నిరుద్యోగుల పక్షాన నిలిచింది. ఇక జీఆర్ఎల్ విడుదల తర్వాత అనేక లొసుగులు పొడచూపాయి. వాటిని పక్కా వివరాలతో ‘నమస్తే తెలంగాణ’ మాత్రమే ప్రచురించింది.
గ్రూప్-1 మెయిన్స్ స్కాం ఒక్కొక్కటిగా బయటికిరావడంతో టీజీపీఎస్సీ ఉక్కిరిబిక్కిరయ్యింది. సందర్భం చిక్కిన ప్రతిసారీ నిరుద్యోగుల నోరు మూయించాలని ప్రయత్నించింది. నిరుద్యోగులకు అండగా ఉన్న వారందరిపైనా లీగల్ నోటీసులు, పరువునష్టం దావా పేరిట బెదిరింపులకు దిగింది. వాస్తవానికి అభ్యర్థుల్లోని అనుమానాలను, సందేహాలను నివృత్తిచేయాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న సంస్థ అలా చేయలేదు. ఆఖరుకు ఒక వివరణను పంపించింది. ఇది కూడా ‘నమస్తే తెలంగాణ’ కథనాల్లో ప్రస్తావించిన అంశాలపై వివరణ ఇవ్వకుండా ఇతర అంశాలతో సమర్ధించుకునేందుకు ప్రయత్నించింది. తప్పులు, తప్పిదాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది.
గ్రూప్-1 అక్రమాలపై మాట్లాడినందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. తెలంగాణభవన్లోకి వచ్చి పోలీసులు ‘సీన్ ఆఫ్ అఫెన్స్’ చేసేందుకు ప్రయత్నించారు. ఆఖరుకు పోలీసులను ప్రశ్నిస్తే వెనక్కి తగ్గారు. బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డికి కమిషన్ ఏకంగా లీగల్ నోటీసు పంపించింది. పరువునష్టం నోటీసులు పంపించింది. పోటీ పరీక్షల శిక్షకుడు అశోక్‌కుమార్‌పై కేసుపెట్టింది. కోర్టు నోటీసులు జారీచేశారు. కోటి రూపాయల పరువునష్టం దావా వేశారు. లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూసిన కమిషన్‌కు హైకోర్టు తీర్పుతో శృంగభంగం అయ్యింది. మరీ కమిషన్ ఇప్పుడేమంటది? హైకోర్ట్‌కు కూడా లీగల్ నోటీసులిస్తుందా? పరువునష్టం దావా వేస్తుందా? అన్న ప్రశ్నలు నిరుద్యోగుల నుంచి వస్తున్నాయి. మొత్తంగా హైకోర్టు తీర్పు నిరుద్యోగులకు ఊరటనిచ్చింది.