మునుగోడు రూరల్, జనవరి 27: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయని నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం మునుగోడు మండల పరిధిలోని కోతులారంలో ఆ గ్రామానికి చెందిన వీరమళ్ల నరసింహాగౌడ్ ప్రథమ వర్ధంతికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలసి హాజరై నరసింహ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి రాగానే అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యేలు ఎంతో ఆశపడ్డారని చెప్పారు. కానీ ఇంతరకు ఏ నియోజకవర్గానికి కూడా సరిపడా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. మూడు వారాల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి మునుగోడు నియోజకవర్గానికి నిధులు కావాలని, కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయాలని కోరినా ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. రెండేండ్లుగా రోడ్లకు నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు.