మిర్యాలగూడ రూరల్, ఫిబ్రవరి 13 : రైతుబంధు సాయం రాకపోవడంతో అప్పులు తెచ్చి వరి సాగు చేశాడు. నీటి ఎద్దడి కారణంగా పొలం సరిగా పండక, దిగుబడి రాక అప్పులు తీర్చే మార్గం లేక నల్లగొండ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్సై పిల్లి లోకేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం కొత్తపేట పంచాయతీ పరిధిలోని ఎర్రకాలువ తండాకు చెందిన రైతు నానావత్ హర్యా(50)కు ఎకరంన్నర పొలం ఉంది.
దానిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి రైతుబంధు సాయం రాకపోవడంతో వానకాలం, యాసంగిలో అప్పులు తెచ్చి వరి సాగు చేశాడు. వానకాంలో సరిగా దిగుబడి రాకపోవడంతో అప్పులు అలాగే మిగిలాయి. యాసంగిలో సాగు చేసిన పొలానికి నీరందక ఒక్కో మడి ఎండుతూ వస్తున్నది. ఈ సారి కూడా దిగుబడి రాదని.. అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపానికి గురయ్యాడు.
బుధవారం రాత్రి అత్తగారి ఇంటి వద్ద ఉన్న కూతురికి ఫోన్ చేసి ‘నిన్ను చూడబుద్ధవుతుంది.. ఇంటికి రమ్మని’ చెప్పాడు. గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో పొలం వద్దకు వెళ్లిన నానావత్ హర్యా పొలం వద్ద ఉన్న వేపచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి రైతులు వెళ్లి చూసే సరికి అప్పటికే మృతి చెందాడు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ దావాఖానకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.