హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పట్టణాల్లో కంటే గ్రామాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. పల్లె, పట్టణ ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేశారు. కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల గ్రామాలకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. గ్రామాల్లో పల్లె ప్రగతి అద్భుతంగా కొనసాగుతోంది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే గ్రామాలు అభివృద్ధి చెందలేదు. ఇవాళ గ్రామాలు పట్టణాల కంటే అద్భుతంగా తయారయ్యాయి.
గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు గ్రామపంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో హరితహారం కార్యక్రమం అనేక ఫలితాలను రాబట్టింది. హరితహారం ఒక ఉద్యమంలా కొనసాగుతోంది. దీంతో గ్రామాలు ఆకుపచ్చగా మారాయి. 12679 గ్రామపంచాయతీల్లో లింకు రోడ్లు, మంచినీటి సమస్య వంటి అంశాలను పరిష్కరిస్తున్నాం. పరిపాలనలో ఎక్కడా లోపం లేకుండా సవ్యంగా ముందుకెళ్తున్నాం. గతంలో నర్సరీల ద్వారా మొక్కుబడిగా మొక్కలు ఇచ్చేవారు. కానీ ఇవాళ గ్రామాల్లో, తండాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి.. అన్ని రకాల మొక్కలను అందిస్తున్నారు.
ఒకప్పుడు వైకుంఠధామాలు లేక అన్ని కులాల వారు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవన్నారు. వైకుంఠధామాలను బ్రహ్మాండంగా నిర్మించుకున్నామని తెలిపారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్ అందించామన్నారు. దాంతో చెత్తను తరలించడం, మొక్కలకు నీరు పోయడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో లక్షల మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదిస్తున్నాం. పుష్కలమైన ఆక్సిజన్ కూడా లభిస్తుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు.