మహబూబ్‌నగర్, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో తాగు, సాగునీరు, విద్యుత్తు సమస్యలు తీరిపోయాయని, తలసరి ఆదాయం పెరిగిందని, రాష్ర్టానికి ఎన్నో అవార్డులు వచ్చాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. దేశంలో ఐటీ రంగంలో వస్తున్న ప్రతి రెండు ఉద్యోగాల్లో ఒకటి కచ్చితంగా తెలంగాణలోనే లభిస్తున్నదని చెప్పారు. 50 శాతం ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్ నగరం నుంచే వస్తున్నాయని పేర్కొన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.62 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని, రూ. 38.5 కోట్లతో నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఉయ్యాలవాడ గ్రామ సమీపంలో 25 ఎకరాల్లో రూ.166 కోట్లతో నిర్మించనున్న నాగర్‌కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఐడీవోసీ కార్యాలయంలో ఉద్యోగులనుద్దేశించి సీఎం మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఎటు చూసినా ఎండిపోయిన చెరువులు, వాగులు, వంకలు కనపడేవని, ఈ కరువుపై ఈ ప్రాంతానికే చెందిన సహజ కవి గోరటి ఎన్నో పాటలు రాశారని తెలిపారు. నేడు హెలికాప్టర్లో నాగర్‌కర్నూల్‌కు వస్తుంటే చెక్‌డ్యామ్‌లో, చెరువుల్లో నీరు కనపడుతుంటే సంతోషంగా ఉన్నదని చెప్పారు. తొమ్మిదేండ్ల తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో చిరునవ్వులు చిందించే తెలంగాణ కోసం ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. వలసలు, కరువుకు నెలవైన ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేడు అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పారు.
పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తాం
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వీలైనంత త్వరగా 100 శాతం పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకొంటారని చెప్పారు. గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మీదుగా వెళ్లే సమయంలో అడవులు కూడా పలుచబడి కనిపించేవని, నేడు కల్వకుర్తి నియోజకవర్గంలోనే 75 నుంచి లక్ష ఎకరాలవరకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఏడేండ్లలోనే ఊహించనివిధంగా అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు. ఈ అద్భుత ప్రగతికి కారణమైన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.
నేడు దేశంలోని ఏ పల్లెలూ తెలంగాణ గ్రామాలకు సాటి రావని సీఎం అన్నారు. ‘మనకంటే ముందు ఏర్పాటైన రాష్ర్టాల్లో కూడా తలసరి విద్యుత్తు వినియోగం, తలసరి ఆదాయం మనకంటే తక్కువగా ఉన్నాయి. ఏ సమాజమైనా ప్రగతి సాధించింది అనడానికి తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం, మాతా, శిశు మరణాల రేటు కీలకం.
వీటన్నింటిలో మనం అన్ని రాష్ర్టాలకంటే మెరుగైన స్థితిలో ఉన్నాం. ఇటీవల ఊరురా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్దది. అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి అద్భుత పథకాలను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచాం. ఇదే స్ఫూర్తితో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా పనిచేసి చిరునవ్వులు చిందించే తెలంగాణ ఆవిష్కారం కోసం కృషి చేయాలి’ అని పిలుపునిచ్చారు.
పరిపాలనను ప్రజలకు చేరువ చేశాం : సీఎస్ శాంతికుమారి
పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకే రాష్ట్రంలో రూ.1,649 కోట్లతో సమీకృత కలెక్టరేట్లు నిర్మించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఇప్పటివరకు 18 కలెక్టరేట్లు ప్రారంభమయ్యాయని, నాగర్కర్నూల్ది 19వ కలెక్టరేట్ అని చెప్పారు. ఈ కలెక్టరేట్లతో జిల్లా అధికారుల కార్యాలయాలన్నీ ఒకే చోటికి వస్తాయని తెలిపారు. సంపద సృష్టి, పంపిణీలో రాష్ట్రం రికార్డు సాధించిందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, డీజీపీ అంజనీకుమార్, ఎంపీలు పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎస్ రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.