నాడు 60 ఏండ్ల అరిగోస.. నేడు 60 రోజుల్లో ధారాదత్తం!
నీళ్లు, నిధులు, నియామకాలు.. తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఈ మూడింటి కోసం! ఇప్పుడు ఆ నీళ్ల పోరాటం నీరుగారిపోతున్నది. ఆ జల-ఆశయం కేంద్రం పాలైంది. పదేండ్లపాటు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మన ప్రాజెక్టులు కేంద్రం పాలుకాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రప్రయోజనాలే పరమావధిగా పనిచేసింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రయోజనాలు మారాయి. నీళ్లకు నీళ్లొదులుతూ ప్రాజెక్టులు చేజారాయి.
60 ఏండ్లు నీటి కోసం గోసపెట్టిన కాంగ్రెస్.. మళ్లీ అధికారంలోకి వచ్చి 60 రోజులైనా కాకముందే.. సాగునీటి ప్రాజెక్టులపై అధికారాన్ని వదులుకునేందుకు సిద్ధమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై పూర్తి పెత్తనాన్ని కేంద్రం ఆధీనంలోని కృష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించేందుకు తలూపింది. మొన్నటివరకు కేఆర్ఎంబీ ప్రతిపాదనకు ఒప్పుకోలేదంటూ వాదించిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రాజెక్టుల అప్పగింతకు తలూపింది.
ఈనెల 17న జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించిందని జల్‌శక్తి శాఖ ప్రకటించింది. అప్పుడు దీన్ని ఖండిస్తూ హడావుడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రాజెక్టులు చేజారాక జనవరి 27వ తేదీన కేంద్ర జల్‌శక్తిశాఖకు లేఖ రాసింది. దాన్నీ రెండురోజులు దగ్గరే పెట్టుకొని 29న ఢిల్లీకి పంపింది.
Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ ప్రొటోకాల్ ఖరారు కాకముందే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి తెలంగాణ సర్కారు ధారాదత్తం చేసింది. అప్పగించేది లేదంటూనే అప్పగించి తెలంగాణ జల హక్కులను చేజేతులా కాలరాసింది. నాగార్జునసాగర్ డ్యామ్‌ను సాయుధ బలగాలతో కదిలివచ్చి ఏపీ ఆక్రమించడం, ఆ అంశంపై జనవరి 17న ఇరు రాష్ర్టాలతో కేంద్ర జల్‌శక్తిశాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడంతోపాటు శ్రీశైలం, సాగర్సహా మొత్తం 15 ఔట్లెట్లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించాలని ఆదేశించడం తెలిసిందే. తాజాగా కేంద్రజల్‌శక్తిశాఖ మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ఇరు రాష్ర్టాలతో కేఆర్ఎంబీ గురువారం కీలక సమావేశం నిర్వహించింది. ఈ మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టులను అప్పగించాలని కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్‌కుమార్ ఇరు రాష్ర్టాలకు సూచించారు. అయితే ఏపీ అందుకు అంగీకారం తెలిపినా, తెలంగాణ అప్పగిస్తేనే తాము ప్రాజెక్టులను అప్పగిస్తామని షరతును పెట్టింది. దీనిపై తెలంగాణ తొలుత ఆపరేషన్ ప్రొటోకాల్‌ను ఖరారు చేయాలని, నీటి వాటాలను తేల్చాలని, ఇప్పటికే ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖరాసిందని వెల్లడించింది. తెలంగాణ లేవనెత్తిన అంశాలకు కేంద్రం నుంచి స్పష్టత వచ్చిన తరువాత, ఆపరేషన్ ప్రొటోకాల్‌ను నిర్ధారించిన అనంతరమే ప్రాజెక్టులను అప్పగిస్తామని తెలియజేసింది. అయితే తెలంగాణ ప్రతిపాదనలను కేఆర్ఎంబీ చైర్మన్ తోసిపుచ్చారు. ప్రస్తుతం ఆపరేషన్ ప్రొటోకాల్ అంశం ట్రిబ్యునల్ ముందు ఉన్నదని, సబ్జ్యూడిస్ మ్యాటర్‌ను ఇక్కడ ప్రస్తావించవద్దని, కేంద్రం వద్దనే తేల్చుకోవాలని తేల్చిచెప్పారు. కేంద్ర జల్‌శక్తిశాఖ సూచనల మేరకు కేవలం ప్రాజెక్టుల అప్పగింత అంశానికే పరిమితం కావాలని నొక్కిచెప్పారు. దీంతో కేంద్ర జల్‌శక్తిశాఖ నిర్దేశించిన ప్రాజెక్టులు, ఔట్లెట్లలో విద్యుత్తు ప్రాజెక్టులను మినహాయించి మిగతా ప్రాజెక్టులను అప్పగించేందుకు తెలంగాణ అంగీకారం తెలిపింది.
ప్రాజెక్టులు, వాటి ఔట్లెట్ల అప్పగింత అం శంపై ఇరు రాష్ర్టాల అంగీకారం కుదిరిన అనంతరం వాటి పర్యవేక్షణ, ఆపరేషన్, మెయింటనెన్స్ అంశాలపై కేఆర్ఎంబీ చైర్మన్ ఇరు రాష్ర్టాలతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగం, విడుదల అంశాన్ని గతంలో మాదిరిగానే ముగ్గురు సభ్యుల కమిటీ నేతృత్వంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్‌ను ఆ రోజునాటికి ఉన్న పరిస్థితులను బట్టి త్రిసభ్య కమిటీనే నిర్ణయించనున్నది. అయితే తాజాగా ప్రాజెక్టులు, ఔట్లెట్లపై ఇరు రాష్ర్టాలకు సంబంధించిన అధికారులను మూడు షిఫ్టుల్లో పెట్టాలని నిర్ణయించారు. సదరు అధికారులు పూర్తిగా బోర్డు అజమాయిషీలోనే పనిచేయనున్నారు. త్రీమెన్ కమిటీ ఉత్తర్వుల మేరకు నీటిని విడుదల చేయాల్సి ఉన్నది. అయితే ఆ అధికారుల జీతాలను మాత్రం ఆయా రాష్ర్టాలే చెల్లించాలని నిర్ణయించారు. శ్రీశైలం ప్రాజెక్టు మెయింటనెన్స్ ఇతరత్రా పనులను ఏపీ, నాగార్జునసాగర్ మెయింటనెన్స్ ఇతరత్రా పనులను తెలంగాణ చేపట్టాలని, అది కూడా బోర్డు అనుమతి పొందిన అనంతరం, బోర్డు పర్యవేక్షణలోనే కొనసాగించాలని తాజా సమావేశంలో నిర్ణయించారు. అందుకు ఇరు రాష్ర్టాలు కూడా అంగీకారం తెలిపాయి.
నవంబర్ 29న అర్ధరాత్రి సీఆర్పీఎఫ్ బలగాలతో తరలివచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం నాగార్జున సాగర్‌డ్యామ్ కుడి కాలువను, డ్యామ్ 13వ గేట్ వరకు దౌర్జన్యంగా ఆక్రమించిన విషయం తెలిసిందే. దీంతో ఇటువైపున తెలంగాణ ప్రభుత్వం సైతం సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది. ప్రస్తుతం నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తిగా సీఆర్పీఎఫ్ బలగాల ఆధీనంలోనే ఉన్నది. బోర్డు అనుమతి లేనిదే ఇరు రాష్ర్టాల ఇంజినీర్లను సైతం అనుమతించవద్దని ఇటీవల కేంద్ర జల్‌శక్తిశాఖ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై కూడా తాజా సమావేశంలో చర్చించారు. సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలోనే నాగార్జున సాగర్ ఉండేందుకు ఇరు రాష్ర్టాలు అంగీకరించాయి. సీఆర్పీఎఫ్ కూడా బోర్డు ఆధీనంలోనే పనిచేయాలని నిర్ణయించాయి. శ్రీశైలం డ్యామ్‌పైన కూడా సీఆర్పీఎఫ్ బలగాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఈ సందర్భంగా వెల్లడించింది. మొత్తంగా త్వరలోనే మరోసారి సమావేశమై ఇతర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు.
కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించేందుకు తెలంగాణతోపాటు మేము ఒప్పుకున్నాం. నీటి కేటాయింపులపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం. బోర్డు పరిధిలో మొత్తం 15 ఓటిస్‌లలో 9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఉన్నాయి. ప్రాజెక్టులు, ఔట్లెట్ల ఆపరేషన్ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాఫ్‌ను కేటాయించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రొటోకాల్‌ను ఆ రోజుకున్న పరిస్థితులను త్రిసభ్య కమిటీనే నిర్ణయిస్తుంది. తాజాగా సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి 2 టీఎంసీలను, మార్చ్‌లో సాగర్ కుడి ప్రధాన కాలువ నుంచి 3 టీఎంసీలను, ఏప్రిల్‌లో 5 టీఎంసీలను ఏపీకి విడుదల చేసేందుకు ఒప్పుకున్నారు. బోర్డు పరిధిలో ప్రాజెక్టుల ఆపరేషన్‌కు తెలంగాణ కూడా ఒప్పుకున్నది.
– నారాయణరెడ్డి, ఈఎన్సీ, ఏపీ జలవనరులశాఖ
కేంద్ర జల్‌శక్తిశాఖ ప్రతిపాదించిన విద్యుత్తు ప్రాజెక్టులు మినహాయించి మిగిలిన 10 ప్రాజెక్టులు, ఇతర ఔట్లెట్ల ఆపరేటింగ్ అంతా కేఆర్ఎంబీ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. పవర్స్టేషన్స్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాగార్జునసాగర్‌ను తెలంగాణ, శ్రీశైలంను ఏపీ చూసుకుంటుంది. ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయి. మా డిమాండ్స్‌తో కేంద్రానికి లేఖలు రాశాం. ఇంకా అకడ నుంచి నిర్ణయం రాలేదు. నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుంది. పరిస్థితిని భట్టి ప్రాజెక్టుల వద్ద భద్రత బోర్డు కనుసన్నల్లో కొనసాగుతుంది. ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదు. కానీ ఆపరేషనల్, నీటి విడుదల బోర్డు చూసుకుంటుంది. సీఆర్పీఎఫ్ సైతం కృష్ణా బోర్డు పరిధిలోనే ఉంటుంది. ప్రాజెక్టుల నిర్వహణ కోసం స్టాఫ్ కావాలని అడుగుతున్నారు. ఆ మేరకు ఉద్యుగులను కేటాయిస్తాం.
– మురళీధర్, ఈఎన్సీ, తెలంగాణ రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ
