Nagarjuna Sagar | నల్గొండలోని నాగార్జున సాగర్ డ్యామ్‌కు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఇంకా కొనసాగుతుండడంతో డ్యామ్ నిండుకుండలా మారుతున్నది. ప్రస్తుతం డ్యామ్ శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 5లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.505 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 266.358 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 573.90కు చేరింది. వరద కొనసాగుతుండడంతో ఉదయం వరకు డ్యామ్ పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో అధికారులు డ్యామ్ గేట్లు ఎత్తేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల వరకు గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు. దాదాపు 2లక్షల క్యూసెక్కులను దిగువకు వదలనున్నారు. ముందుగా కొంత మేర క్రస్ట్ గేట్లు పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.