Nagarjuna Sagar | నల్లగొండ : నాగార్జున సాగర్ నిండు కుండలా మారడంతో.. ఆ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే జులై నెలలోనే 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం 18 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. ఇక సాగర్ గేట్లు ఎత్తడంతో.. ఆ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు, పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆ దృశ్యాలను పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తూ, మరోవైపు ఫొటోలకు ఫోజులిస్తూ ఎంజాయ్ చేశారు.
ఇవాళ ఉదయం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట 14 గేట్లను తెరిచారు. సాయంత్రం నాటికి మొత్తం 26 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590.00 అడుగులు కాగా, ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. గేట్లను ఎత్తిన నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
షెడ్యూల్ ప్రకారం నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా మంగళవారం ఉదయం 10 గంటలకు నాగార్జున సాగర్ గేట్లను తెరువాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకు అందరూ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్లో నాగార్జునసాగర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్న ప్రకారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కానీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గంట ఆలస్యంగా 10 గంటలకు వచ్చారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాను నాగార్జునసాగర్‌కు రానని అలిగి బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయారు. దాంతో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ మాత్రమే హెలికాప్టర్లో నాగార్జునసాగర్‌కు వెళ్లారు.