Nagam Janardhan Reddy | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్‌రెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. చాలాకాలం తర్వాత చంద్రబాబును ఏపీ అసెంబ్లీలో గురువారం కలువడంతో నాగంను చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. నాగం గారు ఎలా ఉన్నారు ? ఆరోగ్యం ఎలా ఉంది? కలిసి చాలారోజులైంది. పిల్లలు ఏం చేస్తున్నారంటూ బాబు ఆరా తీశారు. ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. ఓబులాపురం మైనింగ్‌కు సంబంధించి ఉమ్మడి ఏపీలో అప్పటి తెలుగుదేశం నేతలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం హాజరయ్యారు. ఈ క్రమంలోనే నాగం అసెంబ్లీలోని సీఎం చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి రాష్ట్రంలోని కేసులను ఎట్టకేలకు కొట్టివేయడంపై బాబు చంద్రబాబు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతలు ఉమ్మడి ఏపీలో చేసిన పోరాటాలపై చర్చించారు. నాగం ఫైర్ బ్రాండ్‌గా ఉండేవారని, పార్టీ ఆదేశిస్తే దూసుకెళ్లేవారని బాబు పేర్కొన్నారు. నాల్గోసారి బాబును సీఎంగా చూడడం సంతోషాన్ని ఇచ్చిందని నాగం పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని.. తెలుగు ప్రజలు అన్నిరంగాల్లో విజయం సాధించాలన్నదే తన అభిమతమని నాగం తెలిపారు.