వేల్పూర్, మే 8: పచ్చని తెలంగాణ మీదికి బీజేపీ, కాంగ్రెస్ నేతలు మిడతలదండులా వస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ర్టాన్ని ఆగం చేసేందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పర్యటించారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్, బాల్కొండ, మోర్తాడ్ మండలాల నుంచి బీజేపీ,బీఎస్పీ, కాంగ్రెస్‌కు చెందిన 500 మంది నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లో మంత్రి వేముల సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. కండ్లముందే అభివృద్ధి కనిపిస్తున్నా.. విపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకులేవని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్తు ఇస్తుంటే.. కరెంటు రాక బిహార్‌లో రైతులు ట్రాన్స్ఫార్మర్లు తగులబెడుతున్నారని వేముల చెప్పారు. దేశచరిత్రలోనే రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఓట్లు వేయించుకున్న ఏకైక వ్యక్తి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అని ఎద్దేవా చేశారు. అర్వింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితమ్మను ఓడగొట్టుకున్నామని అన్నారు. మాటతప్పిన అర్వింద్‌ను ఏ ఊరికి పోయినా పసుపు రైతులు తరిమికొడుతున్నారని చెప్పారు.కాంగ్రెస్ రేవంత్‌రెడ్డివి బుడ్డరిఖాన్ మాటలని, ప్రజలు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారని మంత్రి అన్నారు. బండి సంజయ్ అభివృద్ధి తప్ప అన్నీ మాట్లాడుతున్నారని వేముల విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్న పథకమో, అమలవుతున్న కార్యక్రమమో.. తెలంగాణలోనూ అమలు చేయండంటూ బండి సంజయ్ తన పాదయాత్రలో అడగడం తాను ఏరోజూ వినలేదని మంత్రి వ్యాఖ్యానించారు. విషప్రచారం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ ప్రజలే నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.కేసీఆర్ ఒక్కరే రాష్ర్టాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారని, ఆయనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.
ఎవుసంపై రాహుల్‌కు ఏం అవగాహన ఉంది?
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ అర్బన్, మే 8: వ్యవసాయంపై కనీస అవగాహన లేకుండా రాహుల్‌గాంధీ మాట్లాడుతున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులను మోసం చేసేందుకే కాంగ్రెస్ నేతలు మాయమాటలు చెబుతున్నారని, తెలంగాణలో ఆ పార్టీ దుకాణం ఎప్పుడో బంద్ అయ్యిందని తెలిపారు. అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటున్న రాహుల్‌గాంధీ .. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో దానిని ఎందుకు అమలు చేయట్లేదో చెప్పాలని ఇంద్రకరణ్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రైతులు మోసపోరని, వారిని సీఎం కేసీఆర్ రైతులను చైతన్యుల్ని చేస్తున్నారని పేర్కొన్నారు.