నాగర్‌కర్నూల్, డిసెంబర్ 6 : విద్యార్థులు చదువుతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి సూచించారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతి గదిని కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేటి తరంలో డిజిటల్ నైపుణ్యం కీలకమని పేర్కొన్నారు. టెక్నాలజీ నేర్చుకున్న విద్యార్థులు భవిష్యత్‌లో ఏ రంగంలోనైనా రాణిస్తారని అన్నారు. గ్రామీణ విద్యార్థులు ప్రపంచస్థాయి అవకాశాలను అందుకోవాలని సూచించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు డాక్టర్స్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ద్వారా కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.