Congress Govt | హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): ‘మూసీ పునర్జీవనం కోసం ప్రభుత్వ ఖజనా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టబోం. పూర్తిగా ప్రైవేట్ సంస్థల నుంచే నిధులు సమీకరిస్తాం’ అని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేషన్ల నిబంధనలను తుంగలో తొక్కుతున్నది. ఏకపక్షంగా ఆయా కార్పొరేషన్ల మార్గదర్శకాలకు విరుద్ధంగా రుణాలను మంజూరు చేసేందుకు సిద్ధమైంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలంటూ కార్పొరేషన్ అధికారులకు ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఎలా ఇవ్వాలంటూ కార్పొరేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో, ఎలా మంజూరు చేయాలో తెలియక సతమతమవుతున్నారు.
మూసీ సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం హైడ్రా పేరిట ఉప్పల్-2, ఎల్బీనగర్-4, మలక్‌పేట-6 సర్కిళ్లతోపాటు దరియాభాగ్, జియాగూడ, నార్సింగ్ గ్రామాల్లో కలిపి దాదాపుగా 172 ఇండ్లను ఇప్పటివరకు తొలగించింది. వారిలో మైనార్టీలు 126 మంది, ఎస్సీలు 32, బీసీలు 12, ఎస్టీ, ఓసీ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టు గుర్తించింది. బాధితులకు ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇండ్లను కేటాయించింది. మూసీ బాధితులకు జీవనోపాధి కూడా కల్పిస్తామని ప్రకటించింది. అయితే, తాజాగా బాధితులకు ఆయా శాఖల పరిధిలోని కార్పొరేషన్లు, ఎస్‌హెచ్‌జీల ద్వారా సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. జీవనోపాధి కోసం ఒక్కొక్క మహిళకు రూ.2 లక్షల వరకు అందజేయాలని నిర్ణయించగా, కార్పొరేషన్ల ద్వారా 70% అంటే రూ.1.40 లక్షలు, మిగిలిన రూ.60 వేలను ఎస్‌హెచ్‌జీ లింకేజీ రుణాలుగా ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు నిర్దేశించింది. క్షేత్రస్థాయిలో సర్వే బాధితులు ఏ ఉపాధి మార్గాన్ని ఎంచుకుంటారు? తదితర అంశాలను సేకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్పొరేషన్, సెర్ప్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం కార్పొరేషన్ల నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి రుణాలను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తున్నదని అధికారవర్గాలు అసహనం వ్యక్తంచేస్తున్నాయి. ఆయా కార్పొరేషన్లు రుణాల మంజూరులో పాటించే నిబంధనలు, ఎస్‌హెచ్‌జీలు అనుసరించే నిబంధనలు భిన్నంగా ఉంటాయని వివరిస్తున్నారు. ఎస్‌హెచ్‌జీల్లో సభ్యులుగా ఉన్నవారికి వయసు, కాలపరిమితి వంటివాటితో నిమిత్తం లేకుండా సెర్ప్ రుణాలను మంజూరు చేస్తుంది. కానీ, కార్పొరేషన్లు మాత్రం 18-50 ఏండ్ల వయసు ఉన్నవారికి, అదీ ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేసి రుణాలు మంజూరు చేస్తాయి. ఒకసారి సబ్సిడీ రుణాలు పొందినవారికి ఆయా కార్పొరేషన్లు నిర్ణీత గడువు (సగటున ఐదేండ్లు) వరకు తిరిగి ఏవిధమైన రుణాలను మంజూరు చేయబోవు.
ఇతరత్ర అనేక నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతం ఇదే ఇప్పుడు ఇబ్బందిగా మారిందని కార్పొరేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అందజేసిన 172 మంది జాబితాలోని పలువురు కార్పొరేషన్ రుణాలను పొందారని, అదేవిధంగా ఒకే కుటుంబానికి చెందినవారే ఇద్దరు ముగ్గురు ఉన్నారని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. నిబంధనలేవీ మార్చకుండా, అందుకు విరుద్ధంగా రుణాలను మంజూరుచేయాలని ప్రభుత్వం ఒత్తిడితేవడంపై కార్పొరేషన్ అధికారులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టబోమని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు కార్పొరేషన్ నిధులను ఎందుకు వినియోగిస్తున్నట్టు? అవి ప్రభుత్వ నిధులు కావా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.