Musi River | హైదరాబాద్ సిటీబ్యూరో/ఎల్బీనగర్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘మా జోలికి వస్తే ఊరుకునేదే లేదు’ అని తెగేసి చెప్తున్నారు మూసీ బాధితులు. చైతన్యపురిలోని సత్యనగర్, మారుతీనగర్, వినాయక్‌నగర్, ఫణిగిరికాలనీ.. ఇలా తొమ్మిది కాలనీల్లో అందరి నోటా ఇదే మాట. తామెవరం కబ్జాదారులం కాదని, తమ ఏరియాను సర్వే చేసిన మ్యాప్స్ ఒక్కో శాఖది ఒక్కో మాదిరి ఉందంటూ మ్యాప్స్ చూపిస్తున్నారు.
ముఖ్యంగా ఈ కాలనీలన్నీ మూసీ నుంచి సుమారు 23 నుంచి 25 ఫీట్ల ఎత్తులో ఉన్నాయి. తమకు ల్యాండ్ వచ్చిన లింక్ డాక్యుమెంట్స్, హుడా అప్రూవల్ లెటర్స్, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నుంచి ఇచ్చిన ఈసీ, హుడా రెసిడెన్షియల్ సర్టిఫికెట్, లీగల్ ఒపీనియన్స్.. ఇవన్నీ ఇరవై, ముప్పై ఏండ్ల కిందటివి అని చూపిస్తూ, ఇంతకంటే ఇంకేం కావాలి? అని ప్రశ్నిస్తున్నారు.
గూగుల్ మ్యాపులు చూస్తుంటే లంగర్‌హౌజ్ నుంచి నాగోల్ వరకు బఫర్‌జోన్, ఎఫ్టీఎల్, రివర్బెడ్ ఎంత తేడాగా కనిపిస్తుందో చూడాలని చెప్తున్నారు. చైతన్యపురి జోన్‌కు వచ్చేసరికి వెడల్పు పెంచారని, మిగతాచోట్ల సన్నగా ఉంచడం ఎంతవరకు కరెక్ట్? అని మూసీ అలైన్మెంటే సరిగా లేదని, నదీపారకంపై శాస్త్రీయంగా సర్వే జరగలేదని ఆరోపిస్తున్నారు.
50 ఏండ్ల కిందట మారుతీనగర్ లేఔట్
‘చైతన్యపురిలోని మారుతీనగర్ లేఔట్ చేసి 48 ఏైండ్లెంది. సర్వే నంబర్ 78/2లో 1.08 గుంటల భూమిలో మారుతీనగర్ పేరుతో కొత్తపేట విలేజ్, నాగోల్ గ్రామపంచాయతీ, హయత్‌నగర్ తాలూక, రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటుచేశారు. ఈ లేఔట్ చేయడానికి కావలసిన లింక్ డాక్యుమెంట్స్ కూడా 1968 నుంచి ఉన్నాయి. వీటితో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. హుడా ఈ ప్రాంతాన్ని రెసిడెన్షియల్‌గా అప్రూవల్ చేస్తూ సర్టిఫికెట్ ఇచ్చింది.
సబ్‌రిజిస్ట్రార్ కూడా దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ఇచ్చారు. పహాణీల్లోనూ ఈ ల్యాండ్‌ను డ్రై , పట్టా భూములుగా పేర్కొన్నారు. ఇవన్నీ కొత్తగా తీసుకున్న సర్టిఫికెట్లు కావు. ఈ సర్టిఫికెట్లు అన్నీ అధికారులు ఇచ్చినవేగా!’ అని స్థానికులు చెప్తున్నారు.
గతంలో నామమాత్రంగా సర్వే
‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఏప్రిల్ 2013లో రంగారెడ్డి జిల్లా అధికారులు ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డుల్లో లోపాలు సవరించడానికి సర్వే చేశారు. అయితే ఈ సర్వేను సబ్‌రిజిస్ట్రార్, రెవెన్యూ అధికారులు చేయాలని జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీ నియమించారు. సుమారు పది వేల సర్వే నంబర్లలో తేడాలున్నాయని, వీటిని గుర్తించి తప్పులు సరిదిద్దడానికి కమిటీ కార్యాచరణ చేపట్టింది.
కానీ అప్పటి పరిస్థితుల కారణంగా సర్వే చేయకుండానే.. తప్పులనే తిరిగి సైట్లో నమోదు చేశారు. దీంతో పట్టా భూములేవి? ప్రభుత్వ భూములేవి? అనే విషయంలో సరైన సర్వే జరగకపోవడం వల్ల ఇప్పుడు కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా సర్వే చేసి రికార్డుల పరిశీలనతో శాస్త్రీయ విధానంలో తప్పులు సరిదిద్దాలి’ అని మారుతీనగర్ వాసులు కోరుతున్నారు.
జీహెచ్ఎంసీ, ధరణి మ్యాపుల్లో తేడాలు
మారుతీనగర్ మ్యాపులు ప్రభుత్వశాఖల్లో ఒక్కోదగ్గర ఒక్కోలా కనిపిస్తున్నదని తెలుస్తున్నది. 78/2 సర్వే నంబర్ మ్యాప్‌ను పరిశీలిస్తే ధరణిలో ఒకలా, జీహెచ్ఎంసీలో మరోలా, హెచ్ఎండీఏలో ఇంకోలా ఉన్నాయి. మారుతీనగర్, సత్యనగర్‌లో ఉన్న కొన్ని ఇండ్లు ఒక మ్యాపులో ఎఫ్టీఎల్ బయట, మరోమ్యాపులో ఎఫ్టీఎల్ లోపల కనిపిస్తున్నాయి. శాస్త్రీయతే లేకుండా మ్యాపింగ్ చేశారని, ఇప్పటివరకు సరైన మ్యాపులు లేకపోవటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని అధికారులే అనధికారికంగా చెప్తున్న పరిస్థితి.
‘మార్కింగ్ సమయంలో మార్కింగ్ ఎలా చేస్తున్నారని తాము అడిగితే.. తమ వద్ద ఉన్న రికార్డులను బట్టి చేస్తున్నామని అధికారులు తెలిపారు. మరి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ పరిస్థితి ఏమిటి? అని అడిగితే మాకేం తెలియదు అని వారు అంటున్నారు. డాక్యుమెంట్లు చూపించేందుకు వెళ్తే పట్టించుకోవటం లేదు. సరైన విధానంలో సర్వే చేసి ప్రజల ముందు పెట్టి ఆ తర్వాత మూసీ రివర్బెడ్, ఎఫ్టీఎల్, బఫర్జోన్ల హద్దులను నిర్ణయించాలి’ అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సుందరీకరణ అంటే రోడ్డున పడేయడమా
మూసీ నుంచి 23 ఫీట్ల పైన ఉన్నం. ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు కూడా మా దగ్గరకు రాలేదు. మూసీ వరదలతో హైదరాబాద్ మునిగిన తర్వాతే మా కాలనీలోకి నీళ్లు వస్తాయి. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ అన్నారు.. కానీ మా బతుకులను రోడ్డుమీద పడేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? అసలు మీ లక్ష్యమేమిటి? ప్రక్షాళన చేయడమంటే మా ఇండ్లను కూల్చేయమని కాదు కదా. అసలు రోడ్డున పడేసే ముందు ఒకసారి ఆలోచించాలి కదా.
– శ్రీదేవి, సత్యనగర్
మూసీ సర్వే జరిగిందా?
అసలు మూసీకి సంబంధించి సర్వే జరిగిందా? సర్వేలు ప్రజల భాగస్వామ్యంతో జరగాలి. అలాకాకుండా మొక్కుబడిగా సర్వే చేసి మమ అనిపిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం సర్వే నంబర్ 78/2 మూసీ రివర్ ఎఫ్టీఎల్లో ఉన్నదని చూపిస్తున్నారు. ధరణి, జీహెచ్ఎంసీ మ్యాపులే తేడాగా ఉన్నాయి. ఈ రెండు చూస్తే సరిపోదా. సర్వే శాస్త్రీయంగా చేయకపోగా.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇవేమీ రివర్ బెడ్ కాదు. అసైన్డ్ భూములు కావు. రెండు సార్లు ఇది రెసిడెన్షియల్‌గా వాడుకోవచ్చని హుడా అప్రూవల్ ఇచ్చిన డాక్యుమెంట్లూ ఉన్నాయి.
– ఆశిష్ అగర్వాల్, న్యూమారుతీనగర్
రాత్రిళ్లు నిద్రపట్టడం లేదు
మేం ఇక్కడ 25 ఏండ్ల నుంచి ఉంటున్నాం. మాకెలాంటి మూసీ సమస్య లేదు. మా పిల్లలతో పాటు మూసీతో అనుబంధం పెంచుకున్నం. ఇప్పటివరకు మమ్మల్ని మూసీ ఎప్పుడూ ముంచలేదు. నీటి చుక్క కూడా ఇక్కడికి రాలేదు. మేము పూర్తి ఎత్తులో ఉన్నం. మా దగ్గరికి నీళ్లురానప్పుడు మా జోలికి ఎందుకు వస్తరు? అధికారులు వచ్చి బెదిరిస్తుంటే మాకు నిద్ర పట్టడం లేదు. ఎప్పుడేం జరుగుతుందోనని గుండె లు అదురుతున్నయ్.
– సుగుణమ్మ, సత్యనగర్
సర్వేలు చేయకుండానే చేశామన్నారు
మూసీ రివర్బెడ్కు సంబంధించి బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ అంటూ మ్యాపులు కనిపిస్తున్నాయి. ఇందులో మా ప్రాంతానికి వచ్చే వరకు 160 మీటర్లు తీస్తున్నారు. అదే మిగతా ప్రాంతాల్లో 20 నుంచి 25 మీటర్లే తీస్తున్నారు. ఇదేం అంటే అలాగే ఉంటుందన్నారు. అధికారులను అడిగితే గవర్నమెంట్ ల్యాండ్ అని రికార్డుల్లో ఉంటే మార్కింగ్ చేస్తున్నామని అంటున్నారు తప్ప 2013లో వచ్చిన సర్వే నంబర్లపై ఇప్పటివరకూ తేల్చలేదని అడిగితే సమాధానమే లేదు. సర్వేలు చేయకుండా చేశామని చెప్పుకుంటూ మమ్మల్ని రోడ్డున పడేస్తున్నారు.
– చిట్టిబాబు, మారుతీనగర్