KTR | మూసీ రివర్ ఫ్రంట్ పెద్ద స్కామ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మూసీ ప్రాజెక్టు విషయంలో సీఎంని ప్రశ్నిస్తున్నా. మేం మొత్తం దేశంలో ఉండే అన్ని ప్రాజెక్టుల వివరాలు తెప్పించాం. నామామీ గంగే డీపీఆర్, ప్రాజెక్ట్ వివరాలు.. ప్రాజెక్టు పూర్వపరాలు తెప్పించాం. నమామీ గంగే ప్రాజెక్టుపై ఆసక్తితో వివరాలు తెప్పించాను. 2400 కిలోమీటర్ల గంగానది ప్రక్షాళన కోసం కేంద్రం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్టుకు పెట్టిన బడ్జెట్ రూ.40వేలకోట్లు. 2400 కిలోమీటర్ల గంగా నదికి రూ.40వేలుకోట్లు. 50 కిలోమీటర్ల మూసీ సుందరీకరణ కోసం ఈ ముఖ్యమంత్రి రూ.1.50లక్షలకోట్ల ఖర్చు అవుతుందని సీఎం చెబుతున్నారు. దీన్ని స్కామ్ అనక ఏమనాలి? దీనివెనుక ఉన్న మతలబు ఏంటీ? చెప్పాలి కదా. అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడమంటే ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద, తన యంత్రాంగం, పరిపాలనపై తనకే పట్టులేనితనానికి నిదర్శనం కాదా? అని అడుగుతున్నా’నన్నారు.
‘మున్సిపల్ మంత్రిగా నేను ఎనిమిదేళ్లు పని చేశాను. కూల్చాల్సి వస్తే.. మొదట కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసర్. కమిషనర్ ఎక్కడ కుసున్నడో.. బుద్ధ భవన్ నాలామీదున్న ఉన్నది. దాంట్లోనే ఎలక్షన్ కమిషనర్ ఉన్నడు. హైడ్రా కమిషనర్ ఉన్నరు. అందులో ఉమెన్స్ కమిషన్ ఉన్నది. మొదట ఆ భవనం కూల్చాలి. రెండోది ఏ జీహెచ్ఎంసీ పర్మిషన్లు ఇస్తదో.. ఆ జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చాలి. జీహెచ్ఎంసీ ఆఫీస్ కూడా నాలాపైనే ఉన్నది. మరి ఇతరులకు సుద్దులు చెప్పే ముందు నీకాడికేలి మొదలిపెట్టాలి కదా. నాకు తెలిసి సీఎంకి అవకాశం ఇస్తే.. కొత్తగా కట్టుకున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం కూలుస్తడు. ఆయనో లక్ష్యం పెట్టుకున్నడు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా పెట్టుకున్నడు. సెక్రటేరియట్ చూడంగనే అందరికీ కేసీఆర్ గుర్తుకు వస్తడు. మొన్న గణపతి బొప్ప మోరియా అనుకుంటా వెళ్లారు. అక్కడికి రాంగనే కేసీఆర్ గుర్తుకు వచ్చిండు.. కేసీఆర్ పాటలు పెట్టంగనే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది. సందు ఇస్తే అది ఎఫ్టీఎల్ అని సెక్రటేరియట్‌ని కూలుస్తడేమోనని నాకు డౌట్’ అన్నారు.
‘మూసీ బాధితుల ఆక్రందనలు చేస్తున్నా.. ఇబ్బందిపడుతుంటే.. నిన్న మొన్నటి వరకు డైలాగ్‌లు కొట్టిన మీ అధినాయకులు ఎక్కడా? మీ రాహుల్ గాంధీ యేడీ? మీ ప్రియాంక గాంధీ ఎక్కడ? ఇది వరకు వచ్చి ఓట్లు అడుక్కునప్పుడు.. అశోక్‌నగర్‌లో చాయ్ తాగుతూ.. షాదాబ్ హోటల్లో బిర్యానీ తింటూ యాక్టింగ్‌లు చేస్తూ బ్రహ్మాండమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ఓట్లు దండుకున్నారు కదా. మరి ఈ రోజు ఆక్రందనలు వినిపించడం లేదా? కాంగ్రెస్ పెద్దలకు. ఢిల్లీ పార్టీలను ఎప్పుడు గెలిపించినా గల్లీల్లో ప్రజల ఆక్రందనలు ఇలాగే ఉంటాయ్. నేను ఇంకోమాట అడుగుతున్న. మాట్లాడితే ప్రతి సందర్భంలో మమ్మల్ని అడిగేవారు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? అని అడిగారు. కాళేశ్వరం కడుతుంటే ఆ నాడు అడిగారు. కాళేశ్వరంతో ఏం సాధిస్తారు.. పెట్టుబడి పెట్టి ఏం చేస్తారని పదేపదే అడిగేది. కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఒక పంటకు 40లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు. పరిశ్రమలకు 10శాతం నీళ్లు వస్తాయి. హైదరాబాద్ మహానగరంతో పాటు వేలాది గ్రామాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు. హైదరాబాద్ నెత్తిమీద శాశ్వతంగా ఒక కుండపెట్టినట్టే కరువు తీర్చే కల్పతురువు కాళేశ్వరం. కాళేశ్వరం కట్టం తర్వాత వరిసాగులో భారతదేశంలో తెలంగాణ టాప్. ఇది కాళేశ్వరం పుణ్యం కాదా? రూ.లక్షకోట్ల పెట్టుబడితో ఏం జరిగిందంటే.. తెలంగాణ వరిసాగులో టాప్‌గా నిలిచింది’ అన్నారు.
‘కాళేశ్వరంతో తాగునీటి సమస్య పోయింది. హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రానే రాదు. మరి నేను అడుగుతున్న రేవంత్‌రెడ్డి చెప్పు. రూ.1.50లక్షల కోట్ల మూసీ ప్రాజెక్టుతో మురిసేదెంత మంది ? నీ మూసితో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత? మూసీ ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి సాగునీరు వస్తుందా? ఒక రైతుకు లబ్ధి చేకూరుతుందా? ఇప్పటికే మూసీ కింద ఉన్న ఆయకట్టు కాకుండా కొత్తగా ఏమన్న వస్తుందా? మూసీ ప్రాజెక్టులో రిజర్వాయర్ ఉన్నదా? పంప్ హౌస్ ఉన్నదా? అండర్‌గ్రౌండ్ టన్నెల్ ఉన్నదా? ఏం లేకున్నా రూ.1.50లక్షలకోట్లంటే స్కామ్ కాదా? మీరు మాట్లాడితే, మీ రాహుల్ గాంధీ వచ్చి కాళేశ్వరం బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు ఏటీఎం అన్నడు. మూసి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ బ్యాంకా? రూ.1.50లక్షల కోట్లంటే భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాదా? నామామీ గంగేకి రూ.40వేలకోట్లు. సబర్మతి రివర్ ఫ్రంట్ 38.5కిలోమీటర్లు. దానికి మొత్తం ఖర్చు. రూ.7,050కోట్లు. కొద్దిగా పనులు మిగిలి ఉన్నాయట.. ఇంకా నడుస్తున్నయ్. దాని తర్వాత యమున రివర్ ప్రాజెక్ట్ 22 కిలోమీటర్లు. దాని ఖర్చు వెయ్యి కోట్లు. నమామీ గంగేలో ఖర్చు అయ్యింది రూ.20వేలకోట్లు. ఇంకా రూ.20వేలకోట్లు ఖర్చు అవుతుందని వారి అంచనా’ అని తెలిపారు.
‘థేమ్స్ నదికి కూడా ఖర్చుపెట్టింది దాదాపు రూ.40వేలకోట్లు. వీటన్నింటికంటే అద్భుతాన్ని ఆవిష్కరిస్తాననంటే.. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? రాష్ట్ర ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఎంత? ఎవరి కోసం మూసీ ప్రాజెక్టు చేపడుతున్నవ్ చెప్పాలి. మురిసెటోళ్లు ఎవరు? ఎగిరిగంతేసేది ఎవరు? నిన్ను ఒత్తిడి చేస్తున్నది ఎవరు? అసలు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా పైసలు లేవు అంటవ్. పక్క రాష్ట్రంలో చంద్రబాబు పెన్షన్లు పెంచలేదా? అధికారంలోకి రాంగనే వారంలో పెంచాడు కదా? నువ్వు ఎందుకు రూ.4వేలకు పెంచడం లేదు. దానికి పైసలు లేవు. ఈ రోజు వానాకాలం లాస్ట్ డే. ఇంత వరకు రైతుబంధు దిక్కులేదు. రైతులు అడుగుతున్నరు. నాట్లు వేశామ్.. సీజన్ అయిపోతుందని ఎప్పుడు పైసల్ వస్తయని అడుగుతున్నరు.. దానికి సమాధానం లేదు. రుణమాఫీ కావాలని రైతులు సెల్ఫీల ఉద్యమం చేస్తున్నరు. దానిమీద సమాధానం రాదు. కొత్త హామీలు కాదు.. ఇచ్చిన హామీలు ఏమాయ్యాయంటూ.. పెన్షన్లు ఎగ్గొట్టావంటే చెప్పేటోడు లేడు’ కేటీఆర్ మండిపడ్డారు.