Komatireddy Raj Gopal Reddy | సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు, నూతన కార్యవర్గ ఏర్పాటుపై తనను సంప్రదించకపోవడం బాధాకరమని అన్నారు. మునుగోడు నియోజకవర్గం యాదాద్రి జిల్లాలోనే ఉన్నప్పటికీ తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి అస్సలు బాగోలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆయనకు షోఆప్స్ ఎక్కువయ్యాయని అన్నారు. నేను మునుగోడు ఎమ్మెల్యేను.. యాదాద్రి జిల్లాలోనే నా మునుగోడు నియోజకవర్గం ఉంటుంది.. అలాంటప్పుడు యాదగిరిగట్టు ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసినప్పుడు నాకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వన్‌సైడ్ నిర్ణయమని.. ఇది కరెక్ట్ కాదని అన్నారు. సీనియర్ నేతను, ఎమ్మెల్యేను అయిన నాకే చెప్పకుంటే ఎలా అని నిలదీశారు. తనను సంప్రదించి ఉంటే.. నియోజకవర్గం నుంచి ఒక మెంబర్‌ను అయినా మండలిలో చేర్పించుకునేవాడిని అని తెలిపారు. ఇది చాలా దారుణమని అన్నారు. రేవంత్ రెడ్డి బిహేవియర్ ఇలా ఉంటే చాలా కష్టమని మండిపడ్డారు. చైర్మన్ విషయం మాట్లాడదలచుకోలేదు.. కానీ సభ్యుల విషయమైనా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. వాళ్లకు ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేదు.. ఖర్మఅంటూ మండిపడ్డారు.
తనకు నచ్చకనే నల్లగొండలో ముఖ్యమంత్రి సభకు వెళ్లలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. వాళ్ల వ్యవహారశైలి అస్సలు బాగోలేదు.. నాకు నచ్చడం లేదని చెప్పారు. అయినప్పటికీ ముఖ్యమంత్రికి రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని కూడా కలిశానని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నింటిలోనూ చురుగ్గా పాల్గొంటున్నానని చెప్పారు. అలాంటప్పుడు తమకు కూడా యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డులో అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని అన్నారు. కానీ దానిపై సమాచారమే ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు.
ఈ సందర్భంగా పార్టీ వ్యవహార శైలిపైనా విమర్శలు గుప్పించారు. అందరూ సీనియర్ లీడర్సే ఉన్నారు.. పార్టీని ఎలా నడపాలి? నియామకాలు ఎలా చేయాలి? సీనియర్ లీడర్స్‌ను ఎలా గౌరవించాలో వారికి తెల్వదా అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెసోళ్లు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోకి ఎక్కడెక్కడి నుంచో కొత్తవాళ్లు వచ్చారని తెలిపారు. అంతా వాళ్లదే నడుస్తుందని అన్నారు. ఒరిజినల్‌గా తెలంగాణ కోసం కొట్లాడినవాళ్లు అందరూ రోజురోజుకీ కనుమరగవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.