హైదరాబాద్: ఒక వ్యక్తి స్వార్థం కోసం మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే ఈ ఉపఎన్నిక అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే అసలు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో తెచ్చినవారు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. ప్రజలను మోసం చేయలేమని ఆ పార్టీకి అర్థమైందన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీట్దీ ప్రెస్ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కేంద్రంలోని బీజేపీ కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడంతో బీజేపీ భయపడుతున్నదని మంత్రి చెప్పారు.
ప్రజలకు చెప్పడానికి బీజేపీ చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా పథకాలతో రైతులకు భరోసా కల్పించామన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సాయం చేస్తున్నామని వెల్లడించారు. దేశంలో సాగుకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. మిషన్ భగీరథతో ఒక్క ఫ్లోరైడ్ కేసుకూడా నమోదుకాలేదని చెప్పారు.
తెలంగాణ పథకాల గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నదని పేర్కొన్నారు. గుజరాత్లో రైతులకు ఉచిత కరెంటు లేకపోగా ప్రతి బావి దగ్గర మీటర్లు ఉన్నాయన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడుతున్నదని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆ పార్టీ విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్ రూపంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కనిపిస్తున్నదని చెప్పారు. దీంతో కేసీఆర్ను తెలంగాణకే పరిమితం చేయాలని ఆ పార్టీ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టుల కోసం ఉపఎన్నిక తెచ్చిన రాజగోపాల్ రెడ్డి ఓడించాలన్నారు.