హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పట్టణాభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ మాత్రమేనా? జిల్లాల్లోని 130 మున్సిపాలిటీల పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ శాఖ తీరు చూస్తుంటే, ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకప్పుడు నిధుల ప్రవాహంతో కళకళలాడిన పట్టణాలు, నేడు నిధుల లేమితో అధ్వానస్థితికి చేరుకున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యాలు మారడం, పరిపాలనాపరమైన ప్రయోగాలు వికటించడంతో రాష్ట్రంలోని పట్టణ మౌలిక సదుపాయాలు కుప్పకూలుతున్నాయి.రాష్ట్రంలో 130 మున్సిపాలిటీలు ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి మాత్రం కేవలం హైదరాబాద్‌పైనే ఉన్నది. మూసీ ప్రక్షాళన పేరుతో సుమారు రూ.4,000 కోట్లకుపైగా నిధులతో ప్రణాళికలు సిద్ధం చేసిన రేవంత్ సరార్.. జిల్లాల్లోని పట్టణాల మౌలిక సదుపాయాలను విస్మరించింది. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం ద్వారా నిరంతరం సాగిన నిధుల ప్రవాహం ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా మున్సిపాలిటీల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారైంది.
నిధులు నిల్.. సమస్యలు ఫుల్
కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ శాఖలో చేపట్టిన సంసరణలు క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా, కొత్త సమస్యలకు దారితీస్తున్నాయి. పరిపాలనా సౌలభ్యం పేరుతో ఉమ్మడి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి (ఎంఏయూడీ) శాఖను రెండుగా చీల్చడం వల్ల విభాగాల మధ్య సమన్వయం పూర్తిగా దెబ్బతిన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేండ్ల్లలో జిల్లాల మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా కేటాయించిన నిధులు ఏమీ లేవని అధికారవర్గాలే వెల్లడిస్తున్నాయి. అభివృద్ధికి నిధుల్లేక నగరాలు, పట్టణాలు నీరసిస్తున్నాయి. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వరద నిర్వహణ, నియంత్రణ పనులు పడకేశాయి. చెరువుల్లో కాలుష్య నివారణ చర్యలు ఎప్పడో నిలిచిపోయాయి. కాలనీలు, బస్తీల్లో సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పబ్లిక్ పారులు, నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థలను మెరుగుపరచే చర్యలు మూలకుపడ్డాయి. ఫలితాల్లో మున్సిపాలిటీలు అపరిశుభ్రతతో కునారిల్లుతున్నాయి.
నిర్ణయాల అమల్లో జాప్యం
గతంలో ఒకే గొడుగు కింద ఉన్న వ్యవస్థను ఇప్పుడు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్), ఇతర ప్రాంతాలుగా విడగొట్టడం వల్ల గందరగోళం నెలకొన్నది. ఇద్దరు వేర్వేరు ఐఏఎస్ అధికారులను నియమించడంతో నిర్ణయాల అమల్లో జాప్యం జరుగుతున్నది. ఒకే తరహా సమస్యలున్న పట్టణాలకు రెండు వేర్వేరు విభాగాలు ఉండటంతో ఫైళ్ల కదలిక మందగించింది. అటు జీహెచ్ఎంసీ పరిధిలో ఒక నిబంధన, ఇటు మిగతా కార్పొరేషన్లలో మరో నిబంధన అమలవుతుండటంతో ప్రజల్లో గందరగోళం నెలకొన్నది. శాఖను రెండుగా విడగొట్టాక, సీనియర్ అధికారుల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో అభివృద్ధి పనులు ఎకడికకడే ఆగిపోయాయి. జీహెచ్ఎంసీలో ఒక రూల్, పకనే ఉన్న కార్పొరేషన్లలో మరో రూల్ ఉండటంతో సామాన్య ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది.
నిధులన్నీ మూసీ పాలు
హైదరాబాద్‌లోని మూసీ ప్రక్షాళన కోసం రూ.4,000 కోట్లకుపైగా ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం, జిల్లాల్లోని మున్సిపాలిటీలకు మాత్రం నయా పైసా విదల్చడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో నిరంతరాయంగా సాగిన పట్టణ ప్రగతి నిధులు ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ క్లీనింగ్, వరద కాలువల నిర్వహణ వంటి కనీస పనులు కూడా నిధులు లేక ఆగిపోయాయి. మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచకపోవడం, చెత్త సేకరణలో జాప్యం వల్ల పట్టణాలు అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. మున్సిపల్ శాఖ విభజన వల్ల అభివృద్ధి వేగం పుంజుకోవాల్సింది పోయి, సమన్వయలోపంతో పట్టణ ప్రగతి కుంటుపడుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి.
కాగితాలకే పరిమితమైన జీవోలు
ఎన్నికల షెడ్యూల్ రాకముందు ఓటర్లను ఆకట్టుకోవడానికి రూ.2,780 కోట్ల నిధుల విడుదలకు జీవోలు ఇచ్చినా, వాస్తవంగా ఒక రూపాయి కూడా ఖర్చు కాలేదని అధికార వర్గాలే గుసగుసలాడుతున్నాయి. ‘ప్రభుత్వం జీవోలు ఇస్తుంది తప్ప, ట్రెజరీ నుంచి నిధులు విడుదల చేయడం లేదు. కాంట్రాక్టర్లు పాత బకాయిలు రాక కొత్త పనులు చేయడానికి ముందుకు రావడం లేదు’ అని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో జరుగుతున్న కూల్చివేతలు సామాన్య ప్రజలను వణికిస్తున్నాయి. కానీ, అదే సమయంలో ఆ ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాత్మక అభివృద్ధి జరగకపోవడం గమనార్హం. చెరువుల కాలుష్య నివారణ, పారుల అభివృద్ధి వంటి పనులు మూలకుపడ్డాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తన హైదరాబాద్ కేంద్రీకృత విజన్ మార్చుకోకపోతే, జిల్లాల్లోని పట్టణాలు మరింత వెనుకబడిపోయే ప్రమాదం ఉన్నదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
