Municipal Elections | మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు మొదలైంది. పోలింగ్ కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకుగాను 12 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడగా, మిగిలిన 2,569 వార్డుల్లో పోలింగ్ జరుగనున్నది. మున్సిపాలిటీల పరిధిలో ఓటర్ల సౌకర్యార్థం 6,017 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా వార్డుల్లో మొత్తం 10,719 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్లలోని 414 వార్డులకుగాను రెండు వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 412 వార్డుల్లో బుధవారం పోలింగ్ జరుగనున్నది. ఇందుకు 2,174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా వార్డుల్లో 2,225 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం ఓటర్లు 52,17,413 మంది ఉండగా, వీరిలో పురుషులు 25,49,750 మంది, మహిళలు 26,67,025 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలను ప్రకటించనున్నారు. 16న చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు.

Municipal Elections2
మున్సిపల్ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాటుచేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. ఆయా జిల్లాల్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య మంగళవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నదని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వెల్లడించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు 1,379 మంది రిటర్నింగ్ అధికారులు, 41,773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్‌కాస్టింగ్ కోసం 8,191 పోలింగ్ గుర్తించామని, 16,382 బ్యాలెట్ బ్యాకులను వినియోగిస్తున్నామని, అదనపు బ్యాలెట్ బ్యాక్సులను సైతం సిద్ధంగా ఉంచామని వివరించారు.
స్వేచ్ఛగా ఓట్లేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు కమిషనర్ రాణికుముదిని వెల్లడించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని అన్ని పోలింగ్ ప్రాంతాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. పారదర్శకత కోసం అన్ని పోలింగ్, లెకింపు కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ సౌక ర్యం కల్పించినట్టు తెలిపారు. ఫొటో ఓటర్ స్లిప్పుల పంపిణీ ఇప్పటికే పూర్తయిందని పేర్కొన్నారు. టీ-పోల్ మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నదని, ఓటర్లు తమ ఎపిక్ నంబర్ సాయంతో ఓటరు స్లిప్‌ను డౌన్లోడు చేసుకోవడంతోపాటు పోలింగ్ కేంద్రాల వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఫిర్యాదులు లేదా వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 9240021456ను సంప్రదించాలని సూచించారు. ప్రతి ఓటరూ తన ఓటును వినియోగించుకోవాలని కమిషనర్ విజ్ఞప్తిచేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఘటనల్లో మొత్తం రూ.2.67 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు కమిషనర్ రాణికుముదిని తెలిపారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద 4,150 మందిని బైండోవర్ చేసినట్టు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో 1,183 లైసెన్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రూ.1.19 కోట్ల నగదు, రూ.1.04 కోట్ల విలువైన మద్యం, రూ.15.68 లక్షల విలువైన డ్రగ్స్, రూ.16.29 లక్షల ఆభరణాలు, రూ.11.02 లక్షల ఇతరాలు కలిపి మొత్తం రూ.2.67 కోట్ల సొత్తు సీజ్‌చేసినట్టు ఆమె వివరించారు.