హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఓటర్ల ప్రలోభాలకు అభ్యర్థులు తెరతీశారు. నగదు పంపిణీతోపాటు మద్యం, మటన్‌తో ఓటర్లకు ఎర వేస్తున్నారు. గత కొద్దిరోజులుగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో వినిపించిన మైకుల హోరు, పార్టీల నినాదాల జోరు సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. బహిరంగ, ఇంటింటి ప్రచారానికి గడువు ముగియడంతో అభ్యర్థులు ఇప్పుడు తమ వ్యూహాలను మార్చారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. కుల, యువజన సంఘాలతో మంతనాలు, యువతకు క్రికెట్కిట్లు, మద్యం, మటన్ తో దావత్‌లు ఇస్తున్నారు.
బరిలో సంపన్నులే అధికం
116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వా ర్డులు, డివిజన్లలో అభ్యర్థులుగా ఎక్కువ మంది సంపన్నులే బరిలో నిలిచారు. ఖర్చులకు వెనుకాడకుండా తాయిలాలకు తెరతీసినట్టు తెలుస్తున్నది. సోమ, మంగళవారాల్లో రెండురోజులు మాత్ర మే గడువు ఉండటం, బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగనుండటం వల్ల అభ్యర్థులు కంటిమీద కునుకులేకుండా వ్యూ హాలు అమలు చేస్తున్నారు. నాలుగు ఓట్లు ఉన్న కుటుంబానికి కొందరు ఎల్ఈడీ టీవీ లు, ఫ్రిడ్జ్‌లు, వెండి కాయిన్లు సైతం పంచుతున్నట్టు సమాచారం.
ఆ మున్సిపాలిటీల్లో ఇంటికి రూ.50 వేలు
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శంకర్పల్లి, షాద్‌నగర్, మొయినాబాద్ ప్రాంతాల్లో నాలుగు ఓట్లు ఉన్న ఇంటికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అభ్యర్థులు ఇస్తున్నట్టు తెలిసింది. కొత్త మున్సిపాలిటీల్లో కూడా ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పంచుతున్నట్టు సమాచారం. ఖమ్మం జిల్లాలో రూ.5 వేలు, వైరాలో రూ.2 వేల చొప్పున ఇస్తున్నట్టు తెలిసింది. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో ఓటుకు రూ.10 వేల చొప్పున పంచుతున్నట్టు సమాచారం.
ఓటర్లకు మైనంపల్లి డబ్బుల పంపిణీ
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మెదక్ జిల్లా రామాయంపేటలో సోమవారం రాత్రి డబ్బులు పంపిణీ చేస్తుండగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. మైనంపల్లి బైక్‌పై తిరుగుతూ ఓటర్లకు డబ్బులు ఇస్తుండగా అభ్యంతరం తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నాయకులను చె దరగొట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
పట్టించుకోని పోలీసులు
అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బహిరంగంగానే డబ్బుల మూటలు, మద్యం సీసాలు చేతబట్టుకొని ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అందిస్తున్నట్టు సమాచారం. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అనేక జిల్లాల్లో మంత్రులే మూటలను అభ్యర్థులకు అందిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థుల తాయిలాలు పంచే ప్రాంతాలపై కన్నెతి చూడటం లేదని తెలిసింది. అధికార పార్టీ తాయిలాలు ఫలితాలను తారుమారుచేసే ప్రమాదం ఉన్నట్టు రాజకీయ పండితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.