బాన్సువాడ, జూలై 17 : పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు మల్టీ జనరేషన్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రూ.4 కోట్లతో కల్కి చెరువులో సమీపంలో ఏర్పాటు చేస్తున్న పార్కును పనులను సోమవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ పట్టణం బ్యూటిఫికేషన్లో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో టీయూఎఫ్ఐడీసీ పథకం కింద మంజూరు చేసిన నిధులతో ఈ పనులు చేపట్టామని తెలిపారు.ఇందులో ఉమెన్ , సీనియర్ సిటిజన్, చిల్డ్రన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పార్కులో వాకింగ్ ట్రాక్, యోగా, ధ్యానం చేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి సదుపాయాలు కల్పిస్తుండడంతో పాటు రెస్టారెంట్, పార్కింగ్, మరుగుదొడ్లను సైతం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇలా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్న ఇలాంటి పార్కు ఈ చుట్ట పక్కలే కాదని, ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేదని తెలిపారు. పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.