ఇచ్చోడ, మార్చి 6 : ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ మహిళలు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు గురువారం ఉత్తరాలు రాసి పోస్టుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంలో 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు రూ.2500, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం, డిగ్రీ చేసిన ఆడపిల్లలకు సూటీలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని, ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆదేశించాలని డిమాండ్ చేశారు. దేవుళ్ల మీద ఒట్లు వేసి ప్రజలను మభ్యపెడ్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని వారు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వెంటనే ఈ హామీలు అమలు చేయాలని లేనిపక్షంలో తెలంగాణలోని మహిళలంతా కలిసి ఢిల్లీలోని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇండ్ల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, గ్రామస్థులు అర్చన, రేణుకాబాయి, ఇందు బాయి తదితరులు పాల్గొన్నారు.