ఖైరతాబాద్, అక్టోబర్ 18: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పించారని, ముడుగోడులో టీఆర్ఎస్కే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుడు, మత్స్యకార సమన్వయ కమిటీ సభ్యుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ చెప్పారు. మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 11న సుప్రీంకోర్టు ప్రతిష్ఠాత్మకమైన తీర్పును ఇచ్చిందని, ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చేందుకు బీసీ కమిషన్, ప్రభుత్వం నివేదికలు తయారు చేయాలని సూచించిందని తెలిపారు.
52 ఏండ్ల తర్వాత ముదిరాజ్‌లకు సానుకూలమైన తీర్పు వచ్చిందని, అది తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవతోనే సాధ్యమైందని వివరించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 52 లక్షల ముదిరాజ్‌ల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. మునుగోడులో 35 వేల ముదిరాజ్ ఓట్లు ఉన్నాయని, దేశ చరిత్రలోనే ముదిరాజ్‌లకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన టీఆర్ఎస్కు వెన్నంటి ఉంటామని స్పష్టంచేశారు. సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్ ముదిరాజ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బల్ల సత్తయ్య ముదిరాజ్, రాష్ట్ర సమన్వయకర్త బొక్క శ్రీనివాస్, నాయకులు దమ్మిగారి కనకయ్య పాల్గొన్నారు.