ముషీరాబాద్, ఆగస్టు 22: మనువాద బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. దళిత, బహుజనుల సైద్దాంతిక పరమైన శత్రువు బీజేపీ అని తమిళ సినీ నటుడు విజయ్ పేర్కొన్న విషయాన్ని మందకృష్ణ గమనించాలని సూచించారు. శుక్రవారం విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళిత, బహుజనల విరోధి అయిన బీజేపీతో అంటకాగడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని తెలిపారు.
తెలంగాణలో బీజేపీకి పట్టం కట్టాలని మందకృష్ణ, మరికొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎప్పటికైనా మనువాద బీజేపీని దళిత, బహుజనులు నమ్మరని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో తెలంగాణ వ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు.