ముషీరాబాద్, ఫిబ్రవరి 3: ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న ‘లక్ష డప్పులు-వేల గొంతులు’ మహా ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడమంటే మాదిగ సమాజాన్ని విస్మరించడమేనని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల సభలు, సమావేశాలకు అనుమతినిస్తున్న ప్రభుత్వం మాదిగల పట్ల వివక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నదని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో వంగపల్లి విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని విమర్శించారు.
మాదిగల ఐక్యతను చాటేందుకుగాను ‘లక్ష డప్పులు-వేల గొంతులు’ కార్యక్రమాన్ని చేపడుతుంటే అడ్డుకోవడం తగదని సూచించారు. అయినా తమ జాతి అస్థిత్వాన్ని ప్రదర్శిస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇలాగే వివక్ష పూరితంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, 7వ తేదీన లక్షలాది మందితో హైదరాబాద్‌ను నిర్బంధిస్తామని వంగపల్లి హెచ్చరించారు.