నారాయణపేట, ఏప్రిల్ 5 : ‘మిస్టర్.. రేవంత్‌రెడ్డి ఆన్సర్ మీ.. రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తావు? అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. రాష్ట్రంలో సాగునీరు లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నా ముఖ్యమంత్రికి రాజకీయాలు తప్ప కర్షకుల గోస పట్టడం లేదని ధ్వజమెత్తారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా ఎన్నికలప్పుడు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని విమర్శించారు.
రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.15 వేల సాయం, ధాన్యం క్వింటాల్‌కు రూ.5 వందల బోనస్ ఇలా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున అక్కడి ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయించి ఎండిపోతున్న పంటలను కాపాడాలన్న ధ్యాస కూడా రేవంత్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో రైతులు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎకరాకు అవసరమయ్యే ఎరువులపై రూ.19 వేల నుంచి రూ.20 వేల సబ్సిడీ ఇస్తుందని, గిట్టుబాటు ధరతోపాటు రోజువారి కూలి రూ.300కు పెంచినట్టు తెలిపారు.