సన్నాల బోనస్ చెల్లింపులకు, యూరియా కొరతకు సంబంధముందా? బోనస్ భారాన్ని తగ్గించుకునేందుకే కృత్రిమంగా యూరియా కొరత సృష్టిస్తున్నారా? ఆహారోత్పత్తినే దెబ్బతీసేలా సర్కారు వ్యవహరిస్తున్నదా?
అన్నదాతల ఆరుగాలం కష్టాన్ని అవహేళన చేస్తున్నదా? జరుగుతున్న పరిణామాలు అలాంటి అనుమానాలనే రేకెత్తిస్తున్నాయి.
గత యాసంగిలో రాష్ట్రంలో 23 లక్షల టన్నుల సన్నధాన్యం ఉత్పత్తయ్యింది. వాటికి సంబంధించి సర్కారు చెల్లించాల్సిన సుమారు రూ.1100 కోట్ల బోనస్ నేటికీ పెండింగ్‌లో ఉన్నది. ఇప్పుడు వానకాలం సీజన్ కావ డం, దానికితోడు కాంగ్రెస్ తన ఎన్నికల హామీని తుంగలో తొక్కి సన్నవడ్లకే బోనస్ అని మాటమార్చడంతో రైతులు సన్నాలనే ఎక్కువగా సాగు చేశారు. రాష్ట్రంలో ఈసారి సుమారు 30 నుంచి 35 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తవుతుందని అంచనా.
అదే జరిగితే ప్రభుత్వం సుమారు రూ.1500 నుంచి రూ.1700 కోట్ల వరకు బోనస్ చెల్లించాల్సి ఉంటుంది. పెండింగ్ బోనస్‌తో కలిపితే సుమారు మూడువేల కోట్ల వరకు సర్కారు చెల్లించక తప్ప దు. ఆ భారాన్ని తప్పించుకునేందుకే.. ప్రభుత్వం యూరియా కొరత సృష్టిస్తుండవచ్చునని రైతుల్లో అనుమానాలు వ్యక్తమతున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా వరి పంట ఎర్రబారుతున్నదని, ఫలితంగా వానకాలం దిగుబడి 20 నుంచి 30శాతం వరకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యూరియా కొరత తీవ్రమవుతుండటం, దాన్ని నివారించే దిశగా సర్కారు చర్యలేవీ తీసుకోకపోవడం అనుమానాలను పెంచుతున్నది.
తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇవే సందేహాలను లేవనెత్తారు. వడ్ల కొనుగోళ్లు, పంట బోనస్ నుంచి తప్పించుకునేందుకే యూరియా కొరతను కాంగ్రెస్ సర్కారే సృష్టిస్తున్నదని ఆయన ఆరోపించారు. యూరియా సరిపడా ఇచ్చామని కేంద్రం, కొరతే లేదని ముఖ్యమంత్రి చెప్తుండటాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ అంటేనే నమ్మకద్రోహమని, దానికి ఇలాంటివి కొత్తకాదని మండిపడ్డారు.
ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త తెలంగాణ తెచ్చిన పార్టీలో ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నరు. కానీ, సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాత్రం.. తాను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగిరీ పోయేదాకా న్యాయపోరాటం చేస్తం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేవరకూ వదలం. రాబోయే ఆరునెలల్లో రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బాన్సువాడలో పోచారం ఓటమి ఖాయం. – కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో యూరియా సంక్షోభం వెనుక కుట్ర ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. పంటల బోనస్‌ను, కొనుగోళ్లను ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం యూరియా కొరతను సృష్టిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యూరియాను సరఫరా చేయకుండా రైతాంగాన్ని అరిగోస పెడుతున్నదని తూర్పారబట్టారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైందని నిప్పులు చెరిగారు. ‘కేసీఆర్ పాలనలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్ది బంగారు పళ్లెంలో పెట్టి అప్పగిస్తే రేవంత్‌రెడ్డి అసమర్థ, చేతగాని పాలనతో అస్తవ్యస్తం చేశారు’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో కాంగ్రెస్‌కు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్నదని విరుచుకుపడ్డారు. 21 నెలల్లోనే రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిందని నిప్పులు చెరిగారు. పాలన చేతగాని కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అవసరమైతే మళ్లీ సుప్రీంకోర్టుకు
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని స్పష్టం చేశారు. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసే విషయంలో స్పీకర్ ఆలస్యం చేస్తే తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితి ఉన్నదని, కానీ ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త తెలంగాణ తెచ్చిన పార్టీలో ఉన్నామని గర్వంగా చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనను పక్కనబెట్టి నిత్యం కేసీఆర్ నామస్మరణ చేస్తున్నారని, లేదంటే ఆయనకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రూ. 2.8 లక్షల కోట్ల అప్పులు చేస్తే కాంగ్రెస్ మాత్రం 21 నెలల్లో రూ. 2.2 లక్షల కోట్ల రుణాలు తెచ్చి రికార్డు సృష్టించిందని దెప్పిపొడిచారు. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి చేసిందేమీలేదని, ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రారంభించలేదని, ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని దుయ్యబట్టారు.
పార్టీలో చేరింది వీరే..
ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కోటగిరి వల్లేపల్లి శ్రీనివాస్, బాన్సువాడ మాజీ జడ్పీటీసీ నార్ల రత్నకుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొట్టే గజేందర్, మాజీ సర్పంచులు పద్మా మొగిలయ్య, బంజా గంగారం, కురలేపు నగేశ్, మాజీ కో ఆప్షన్ మెంబర్ హకీమ్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.