టేకులపల్లి, డిసెంబర్ 14 : మోసపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ నాయకులకు పంచాయతీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూక్యా దళ్‌సింగ్‌నాయక్, బే తంపూడి పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్‌రావు, మాజీ దళ కమాండర్ పూనెం నర్సయ్య తదితరులు మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో మంచి స్థానం ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ వారికి ఫోన్లో హామీ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వద్దిరాజు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి మెస్సీపై ఉన్న ప్రేమ బీసీలపై లేదనిన విమర్శించారు. బీసీ బిడ్డగా పార్లమెంట్లో ప్రైవేటు బీసీ బిల్లు ప్రవేశపెడతానని, దీనికి అన్ని పార్టీల మద్దతివ్వాలని కోరారు.
దేవరుప్పుల, డిసెంబర్ 14: ‘రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. నేను మళ్లీ మంత్రిని అవుతా.. సర్పంచ్‌లను గెలిపించండి.. గ్రామాలకు పూర్వ వైభవం తీసుకొద్దాం’అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కోలుకొండ, దేవరుప్పుల, పెదమడూరు, అప్పిరెడ్డిపల్లి, సింగరాజుపల్లి, నీర్మాల, రామరాజుపల్లి, సీతారాంపురం, కడవెండి, మన్‌పహాడ్, గొల్లపల్లి, కామారెడ్డిగూడెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసి ఓట్లేయించుకున్న రేవంత్‌రెడ్డి తెలంగాణను దశాబ్దంపాటు అభివృద్ధిలో వెనక్కు నేట్టారని ఆరోపించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ అనతి కాలంలోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఇదేనని అన్నారు. ఇక పాలకుర్తిలో తాను చేసిన అభివృద్ధే కనిపిస్తున్నదని తెలిపారు. నిధులు లేక ఏ ఒక్క పని కాలేదని, తాను మంజూరు చేసిన పనులను చేసే సమర్థత ఎమ్మెల్యేకు లేదని విమర్శించారు. గ్రామాల్లో సర్పంచ్‌లకు వేసే ప్రతి ఓటు తనకు వేసినట్టేనని, అన్ని గ్రామాల్లో గులాబీ జెండాలు ఎగురవేయాలని కోరారు.