Vaddiraju Ravichandra | కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు అవమానానికి గురయ్యారని రాజ్యసభ ఎంపీ, , బీఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి కాలయాపన చేస్తూ బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూనే ఉందని విమర్శించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఢిల్లీలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీ లీడర్లతో జంతర్‌మంతర్ వద్ద ధర్నా పేరుతో డ్రామా చేశారని వద్దిరాజు విమర్శించారు. ఈ ధర్నాలో రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప BC లకు 42 శాతం రిజర్వేషన్ చట్ట బద్ధత అమలు కాదని తేల్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని అప్పుడే అర్థమైందని అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని జీవో తెచ్చి మరో మోసానికి తెరలేపారని విమర్శించారు. బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని కేటీఆర్, హరీశ్ రావు అనేక సార్లు డిమాండ్ చేస్తే, ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం కారణంగా నాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. నేడు బీసీలకు ఇస్తామన్న హామీలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుంటే బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగానికి పాల్పడిన అత్యధిక స్థానాల్లో BRS పార్టీ విజయం సాధించిందని తెలిపారు. కుల గణన పూర్తిగా ఆశాస్త్రీయమని, కుల గణన పేరుతో BC లను తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. మధ్య ప్రదేశ్‌లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఎలా సాధ్యం అయిందో వెళ్ళి చూస్తే అర్థమవుతుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీపై బీసీలు చాలా ఆగ్రహంతో ఉన్నారని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. రెండో విడత, మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ఢిల్లీ వెళ్లి మోదీ, రాహుల్ గాంధీని కలిసేందుకు రేవంత్ రెడ్డికి టైమ్ ఉంటుందని.. అలాంటప్పుడు బీసీలకు ఇచ్చిన హామీలపై వారితో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని బిహార్ ఎన్నికల సందర్భంగా అబద్ధాలు చెప్పారని తెలిపారు. అబద్ధాలు చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీకి బిహార్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.
అనేక పథకాలను పెట్టి బీసీలను కేసీఆర్ ఆదుకున్నారని వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాంగ్రెస్ మోసాలను బీసీలు గమనిస్తున్నారని.. బీసీ జ్వాలలో కాంగ్రెస్ పార్టీ మసైపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్లమెంట్లో BC లకు 42 శాతం రిజర్వేషన్లపై INDIA కూటమి ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఒక్కసారైనా మాట్లాడలేదని అన్నారు. బీసీ బిడ్డగా తాను ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టానని గుర్తుచేశారు. ఈ బిల్లుకు అన్ని పార్టీల మద్దతును కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని తెలిపారు. ఆనాడు కేసీఆర్ బీసీలకు 33 శాతం రిజర్వేషన్ పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని అన్నారు. కానీ బీసీలను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదు కాబట్టే.. లోక్‌సభ, రాజ్యసభలో చర్చకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ డిమాండ్ చేయలేదని తెలిపారు. పార్లమెంట్లో కేవలం ఓటు చోర్, సర్ (SIR)పై చర్చకు పట్టుబట్టడం కాదు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై చర్చకు డిమాండ్ చేయాలన్నారు.