ఖమ్మం, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు అంటూ ఓట్లు దక్కించుకొని ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని, ప్రజా ప్రభుత్వంలో గ్రామాల్లో పరిపాలన కుంటుపడిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, ఇంటింటికీ బాకీ కార్డులను పంపిణీ చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులదే విజయమని ధీమా వ్యక్తంచేశారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ను నేరుగా ఎదుర్కోలేక తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అకారణంగా కేసులు పెట్టడం, వివిధ కారణాలతో వేధింపులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా వారేమీ పట్టించుకోవడం లేదని అన్నారు. నాలుగో మంత్రిగా తుంబూరు దయాకర్‌రెడ్డి, ఐదో మంత్రిగా మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని వ్యవహరిస్తూ అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, బానోతు చంద్రావతి, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ సతీమణి మంజుల, జడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.