మంచిర్యాల, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘పోలీసులా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా? ప్రభుత్వ అధికారులా? అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులా? వారంతా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పినట్టుగానే పనిచేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నది’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీలో చేరలేదని క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. క్యాతనపల్లి 11వ వార్డు కౌన్సిలర్ భూమయ్యగౌడ్ ఇంటిపై సింగరేణి, రెవెన్యూ అధికారుల దాడి.. కౌన్సిలర్ కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసిన నేపథ్యంలో శనివారం బాధిత కుటుంబాన్ని కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నాయకుడు రాజిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్‌తో కలిసి ఆయన శనివారం క్యాతనపల్లిలో పర్యటించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు.
క్యాతనపల్లిలో ప్రజాతీర్పునకు కట్టుబడి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరుగకుండా మంత్రి వివేక్, ఎంపీ వంశీ అరాచకకాండ సాగిస్తున్నారని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. 22 స్థానాలకు గాను బీఆర్ఎస్, సీపీఐ కూటమి కలిపి 14 సీట్లను కైవసం చేసుకున్నదని, సజావుగా ఎన్నిక నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉన్నదని, కానీ, కానీ ఎన్నికల కమిషన్ డమ్మీగా మారిందని ధ్వజమెత్తారు. ప్రేక్షకపాత్ర వహించి పోలీసులు, అధికార పార్టీ నాయకులు ఏం చెప్తే దానికే తలొగ్గి ఎన్నికలను వాయిదా వేసిందని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, మూల రాజిరెడ్డితోపాటు దాదాపు 20 మందిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. వారందరినీ జైలుకు పంపి బలవంతంగా క్యాతనపల్లి మున్సిపాలిటీని వశపరచుకోవాలనే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సీపీఐకి చెందిన నలుగురు కౌన్సిలర్లపై మంత్రి వివేక్ ఒత్తిడి చేసి ఎలాగైనా లొంగదీసుకోవాలన్న ఉద్దేశంతో బేరసారాలు సాగించారని, అవి ఫలించకపోవడంతో బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
రాళ్లు విసిరిన కాంగ్రెస్ నాయకులపై ఎందుకు కేసులు పెట్టలేదో? చెప్పాలని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. 30 ఏండ్లుగా నివాసం ఉంటున్న కౌన్సిలర్ భూమయ్యగౌడ్ ఇల్లు ఇప్పుడే సింగరేణి యాజమాన్యానికి గుర్తుకొచ్చిందా? అని నిలదీశారు. ఆయన భార్యను వేధింపులకు గురిచేసి ఆవేదనకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పరిస్థితిలో భూమయ్యగౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
క్యాతనపల్లిలో బీఆర్ఎస్తోపాటు మిత్రపక్షంగా ఉన్న సీపీఐ కార్యకర్తలను కాపాడుకోడానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నదని చెప్పారు. ఇదే సమయంలో అక్కడికొచ్చిన మహిళలు భూమయ్య భార్య విజయకు స్థానిక మహిళలు సంఘీభావం తెలిపారు. మరోసారి ఇక్కడికి ఎవరైనా వస్తే చెప్పులతో సమాధానం చెప్తామని వారు హెచ్చరించారు. ‘ఇప్పుడు భూమన్న ఇంటిమీదికొచ్చిండ్రు.. రేపు మా ఇండ్ల మీదొకొస్తరు.. మేమెందుకు వదిలిపెడతం’ అని ముక్తకంఠంతో హెచ్చరించారు.