ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 21: సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆకాంక్షించారు. ఖమ్మం పటేల్ స్టేడియంలో శనివారం నిర్వహించిన ‘సీఎం కప్ 2025-26 బాల్ బ్యాడ్మింటన్ స్టేట్‌మీట్’ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఖమ్మంలో బాల్ బ్యాడ్మింటన్ స్టేట్‌మీట్ జరుగడం సంతోషకరమని అన్నారు. ఆర్చరీ, బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లాస్థాయిలో మంచి ఆటతీరును ప్రదర్శించిన క్రీడాకారులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు.
కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ.. క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపకరిస్తాయని వ్యాఖ్యానించారు. ప్రతిఒక్కరూ గొప్పగా రాణించి ఖమ్మానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం ఆర్చరీ రాష్ట్రస్థాయి పోటీల్లోని విజేతలకు మెడళ్లు, సర్టిఫికెట్లను కలెక్టర్ ప్రదానం చేశారు. తొలుత స్టేడియంలో క్రీడా జెండాను ఎగురవేసి, క్రీడాకారులను పరిచయం చేసుకుని కొద్దిసేపు బాల్ బ్యాడ్మింటన్ ఆడి అలరించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి తుంబూరు సునీల్‌రెడ్డి, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రమణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుట్టా శంకరయ్య, వివిధ అసోసియేషన్స్ బాధ్యులు, కళాశాలల ప్రతినిధులు వీ.సురేశ్, బీ.శ్రీనివాస్, రవి, కే.నవీన్, అశోక్‌రెడ్డి, క్రిస్టోఫర్, రామారావు, ఆదర్శ్, చిన్ని, భూక్యా గోపి, భూక్యా ఉమ, శశికళ, బయ్య నవీన్ తదితరులు పాల్గొన్నారు.