హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఓఎమ్మార్ షీట్లు రోడ్డు పక్కన ప్రత్యక్షమైన ఘటన విషయంలో టీజీపీఎస్సీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఓమ్మార్షీట్లు రోడ్లపై దర్శనమివ్వడాన్ని సీరియస్‌గా తీసుకున్నది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు సెక్షన్ అధికారులను సస్పెండ్ చేసింది. మరో నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. రికార్డుల రవాణా, నిర్వహణలో కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు గుర్తించిన కమిషన్.. సదరు కాంట్రాక్టర్‌కు ఇచ్చిన వర్క్ ఆర్డర్‌ను రద్దుచేసింది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది.
విచారణ కొనసాగుతున్నదని వెల్లడించింది. ఈ ఓఎమ్మార్షీట్లు 2018లో నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆపీసర్(హెచ్‌డబ్ల్యూవో) నియామక పరీక్షకు సంబంధించినవని.. ప్రస్తుతం జరుగుతున్న నియామకాలపై ఎలాంటి ప్రభావం చూ పదని కమిషన్ వెల్లడించింది. 2020లో ఫలితాలు ప్రకటించామని, నిర్వీర్యం నిబంధనల ప్రకారం వాటిని ధ్వంసం చేయాలని నిర్ణయించినట్టు కమిషన్ తెలిపింది. ఈ పనిని ఓ కాంట్రాక్ట్‌కు అప్పగించామని, వాటిని తరలించే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కొన్ని ఓఎమ్మార్ షీట్లు రోడ్డుపై కనిపించినట్టు పేర్కొన్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.