హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో అధికారులు కుమ్మక్కయ్యారని, సీఎం రేవంత్‌రెడ్డికి తొత్తులుగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. వీరంతా అధికార దుర్వినియోగానికి పాల్పడి స్థానిక మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వారి కుమారుడు ప్రశాంత్‌రెడ్డిపై కేసులు పెట్టారని విమర్శించారు.
క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో నిలిచిపోయిన చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలను వెంటనే జరిపించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, విప్ కేపీ వివేకానందతో కలిసి ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని చెప్పుకోవడంలో అర్థం లేదని విమర్శించారు. ఎన్నికలంటే అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా అధికార యంత్రాంగం వ్యవహరించిందని ఆరోపించారు. రాజ్యాంగం పట్ల కనీస గౌరవం ఉన్న వాళ్లు ఇంత దుర్మార్గానికి పాల్పడరు అని దుయ్యబట్టారు. ప్రజలు ఇచ్చిన తీర్పును హత్య చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయినా, అక్కడ అమలులోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 18న హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ, ఆ ఆర్డర్‌ను అమలు చేయడం లేదని మండిపడ్డారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను జైలుకు పంపారని, కౌన్సిలర్లపై కేసులు పెట్టారని ద్రాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో 90 మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలిచింది కదా? అవి సరిపోవా? అని ప్రశ్నించారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేసిన బాల్కసుమన్ ఆదిలాబాద్ జైల్లో అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయనకు సరైన ఆహారం, నీరు కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ముక్కు నేలకు రాసినా, ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లిలో గెలువరని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఉపేందర్, కురువ విజయ్‌కుమార్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.