హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళా, బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని రాజ్యసభసభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్రానికి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో ఆలిండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ 3వ జాతీయ సదస్సును బుధవారం నిర్వహించింది. సదస్సులో పాల్గొన్న వద్దిరాజు మాట్లాడుతూ మోదీ ఓబీసీకి చెందిన వారే అయినప్పటికీ న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణలో సామాజిక న్యాయం లభించిందని చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అణిచివేతలు, కూల్చివేతలు తప్ప ఏమీలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, కులగణన చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు.
దేశీయ వినియోగం, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా స్థానికంగా సహజ వాయువు ఉత్పత్తులపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని వద్దిరాజు రవిచంద్ర కేంద్రానికి సూచించారు. పార్లమెంట్ కమిటీ హాలులో స్థాయీ సంఘం సమావేశంలో వద్దిరాజుతోపాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. పెట్రోలియం,సహజ వాయువు ఉత్పత్తులు, వాటి ధరలు, రవాణా, మారెటింగ్ తదితర అంశాలపై ఆయన పలు సూచనలు చేశారు.