హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీసీ కులగణన చేసి, బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం ఆయన బహిరంగలేఖ రాశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను 22 నుంచి 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిందని, కులగణన జరిపి జనాభా ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ గతంలో ప్రకటించారని గుర్తుచేశారు. అయినా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవగానే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.