హైదరాబాద్, జూలై 10(నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ వరి రైతులపై మరో కుట్రకు తెరలేపిందా? తాజాగా వరి సాగు, యూరియా వినియోగంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన సందేహం ఇది. మూడేండ్ల కిందట యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా కొర్రీ లు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో వరి సాగును పూర్తిగా బంద్ చేయించే దిశగా అడుగులు వేస్తున్నదా? ఇందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సహకరిస్తున్నదా? ఇందులో భాగంగానే రెండు ప్రభుత్వాలు కలిసి యూరియా కొరతను సృష్టిస్తున్నాయా? ఇలా ఎన్నోప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో వరి సాగు అవసరం లేదని స్పష్టంచేశారు. ఏటా రాష్ట్ర అవసరాలకు 45 లక్షల టన్నుల ధాన్యం సరిపోతుందని, కానీ రైతులు 2.80 కోట్ల టన్నులు పండిస్తున్నారని చెప్పారు. ఇంత భారీ మొత్తంలో ఉత్పత్తి అయిన ధాన్యం ఎవరికి అవసరమని ప్రశ్నించారు. రాష్ట్రంలో, దేశంలో వరి లేక (అన్నం లేక) ఒ క్కరు కూడా చనిపోవడం లేదంటూ అత్యంత దారుణంగా మాట్లాడారు.
ఇప్పుడు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వరి ఎక్కువగానే సాగవుతున్నదని పేర్కొన్నారు. యూరియా వినియోగంపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని రాష్ర్టాల కన్నా తెలంగాణ రైతులు అత్యధికంగా యూరియా వినియోగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వమే యూరియా ఇస్తున్నదని, పండించిన ధాన్యాన్ని కూడా కొంటుందని కాబట్టి, రాష్ట్రంలో వరి సాగును ప్రోత్సహించొద్దని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని, వరిసాగును తగ్గించాలని సూచించారు.
కేంద్రంలోని మోదీ సర్కారు 2022లో యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన దొడ్డు ధాన్యం కొనుగోలు చేయబోమంటూ మొండికేసింది. యాసంగిలో వరి సాగు చేయోద్దనేలా సంకేతాలు ఇచ్చింది. దీంతో వరి సాగుపై ఆధారపడ్డ లక్షలాది మంది తెలంగాణ రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పుడప్పుడే గాడిలో పడుతున్న తమ జీవితాలు మళ్లీ ఆంక్షలతో దెబ్బతింటాయని ఆవేదన చెందారు. దీంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంపై పెద్ద యుద్ధమే చేసింది. గల్లీతో పాటు ఢిల్లీ వేదికగా రైతుల కోసం బీఆర్ఎస్ ధర్నాలు, పోరాటాలు చేసింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి రాష్ట్ర మంత్రులు ధాన్యం కొనుగోలు చేయాలని కోరగా, ఆయన ‘తెలంగాణలో యాసంగి ధాన్యంలో నూకలు ఎక్కువ అవుతాయి. వాటిని మేం ఏం చేసుకుంటాం. మీ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండి’ అంటూ ప్రజలను, రైతులను కించపరిచేలా, అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పోరాటంతో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత ధాన్యం కొనుగోలుకు అంగీకరించింది.
ఇప్పుడు రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వంతో కలిసి నాటి ప్లాన్‌ను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వరి సాగు అవసరం లేదని వ్యాఖ్యానించారని చెప్తున్నారు. కుట్రలో భాగంగానే రాష్ట్రంలో రైతులకు యూరియా కొరతను సృష్టిస్తున్నారని అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడూ రాని యూరియా కొరత, ఇప్పుడే ఎందుకు వస్తున్నదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైతులను వరి సాగు నుంచి తప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే ఈ నాటకం ఆడుతున్నాయని భావిస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం యూరియా కోసం కేంద్రంపై ఆశించిన స్థాయిలో ఒత్తిడి చేయడం లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.