K Keshawa Rao | ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ గుజరాత్‌కు వెళ్లిన సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎందుకు స్వాగతం పలకడానికి వెళ్లలేదని, దాని గురించి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు నిలదీశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ఏ నిధులు వినియోగించుకోలేదో చెప్పాలని ప్రధానమంత్రి నరేందమోదీ, బీజేపీ నేతలను ప్రశ్నించారు. హైదరాబాలో ప్రధానమంత్రి మోదీ పాల్గొన్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంలా మార్చారని విమర్శించారు.
పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, రెండింటిని కలపడం సరికాదన్నారు. పార్టీ ప్రచారానికి ప్రభుత్వ కార్యక్రమాన్ని వాడుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో అభివృద్ధి జరగట్లేదు అని ప్రధాని అన్న మాటల్లో నిజం లేదని, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగడంలేదన్నారు. పరిశ్రమలు, ఐటీ, విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, సంక్షేమం, రోడ్లు, వ్యవసాయం, విద్యుత్ ఇలా అనేక రంగల్లో దేశంలో ఏ రాష్ట్రంలోని లేని అభివృద్ధి ఇక్కడ జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. కేంద్ర మంత్రులు, శాఖల నివేదికలే దీనికి సాక్ష్యం, నిదర్శనంగా నిలుస్తాయన్నారు.
2011లో నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో వైబ్రెంట్ గుజరాత్ నిర్వహిస్తే మన్మోహన్ సింగ్ హాజరయ్యారని, ఆ కార్యక్రమానికి ఆ కార్యక్రమానికి వెళ్లలేదన్నారు. ఇలా అనేక సార్లు ప్రధానమంత్రికి ఆ నాడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ స్వాగతం పలకలేదని, ఆ కార్యక్రమాల్లో పాల్గొనలేదన్నారు. దానిపై బీజేపీ నేతలు ఏం సమాధానం చెపుతారని కేకే నిలదీశారు. తెలంగాణకు అదనంగా ఒక్క పైసా రావడంలేదని రాజ్యాంగబద్దంగా రావాల్సిన నిధులే ఇస్తున్నారన్నారు. కేంద్రంలో మెజారిటీ ఉందనే గర్వం, అహంకారంతో బీజేపీ వ్యవహరిస్తోందని, ఇది ప్రజస్వామ్యానికి మంచిదికాదని కేశవరావు ఆందోళన వ్యక్తం చేశారు. సమాఖ్య స్పూర్తిని కొనసాగించాలని మోదీకి సూచించారు.
రైల్వే శాఖ కార్యక్రమాల్లో ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీల పేర్లు కచ్చితంగా పెడుతారని కానీ, శనివారం నాటి ప్రధాని కార్యక్రమంలో ఎక్కడా ఎంపీల పేర్లు లేవని, ప్రోటోకాల్ అమలు చేయడంలేదన్నారు. గతంలో భారత్ బయోటెక్‌కు వచ్చినప్పుడు స్వాగతం పలకడానికి, కంపెనీ కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎంను రావద్దని అన్నారని కేకే గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నయా పైసా కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. తెలంగాణలోని ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని గతంలో చెప్పారని, కానీ హామీ నెరవేరలేదన్నారు. జాతీయ రహదారులకు నిధులు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్న కేంద్రం, జాతీయ రహదారులపై భారీగా టోల్ టాక్స్‌లు వసూలు చేస్తోందని ఆయన గుర్తు చేశారు.