షాబాద్, జూలై 15: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కచ్చితంగా జాతీయ హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో దివంగత మంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చి వెళ్లారని, ఎన్నికల్లో బీజేపీ గెలవకపోవడంతో వివక్ష, కక్షతో హోదా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 16 నియోజకవర్గాల్లోని 1226 గ్రామాల్లోని ప్రతి ఎకరాకు సాగు నీరందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని చెప్పారు. ఇప్పటివరకు ఉదండాపూర్ వరకు 95% పనులు పూర్తి చేసుకొని, అక్కడి నుంచి వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు నీరు తెచ్చుకుందామని చూస్తుంటే, కేంద్రం కమిటీలతో ఆలస్యం చేస్తున్నదని, కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తున్నారని తెలిపారు. రిపోర్టులో తేడాలున్నాయని, అందుకే ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం లేదని కేంద్రం కహానీ చెప్తున్నదని పేర్కొన్నారు. కక్షతో తెలంగాణకు అనుమతులు ఆపడం సరికాదని సూచించారు. ఎంపీ, యూపీలో టైగర్ రిజ ర్వు ఉన్నా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని, దానికోసమన్నా ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి, జాతీయ హోదా కల్పించాలని పేర్కొన్నారు.
కేంద్రానికి గుణపాఠం తప్పదు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యానికి కారణం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలేనని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మండిపడ్డారు. అనుమతులు ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో కేంద్రానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను ఏ రైతు కూడా తిరగనివ్వరని, వందశాతం రైతులంతా కేసీఆర్ వెంట నిలబడి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తారని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చెప్పారు. ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్‌కు వచ్చిన మోదీ, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని చెప్పారని, ఇప్పుడు అనుమతులు కూడా ఇవ్వడం లేదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.