ఖైరతాబాద్, జూలై 13: ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వోద్యోగులతో సమానంగా గుర్తించాల ని ఎంపీలు ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఔట్ సో ర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. అడ్డా మీద కూలీలకు రూ.600 నుంచి రూ.800 వస్తుంటే, చదువుకున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.400 మాత్రమే వస్తున్నాయని ఈటల రాజేందర్ తెలిపారు.
ప్రభుత్వ సీనియర్ ఉద్యోగులకు లక్షకు పైగా వేతనాలు ఉంటే, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో పీహెచ్డీ చేసిన వారున్నా రూ.12 వేల జీతం తీసుకొని పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రె స్ ప్రభుత్వం చొరవ తీసుకొని పీఆర్సీ పద్ధతిలోనే వేతనాల పెం పు వంటి చర్యలు చేపట్టాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల డి మాండ్లకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.
ప్రైవేట్ ఏజెన్సీల చేతుల్లో శ్రమదోపిడీకి గురవుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవేనని కృష్ణయ్య తెలిపారు. సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నదని గుర్తు చేశారు. ఖాళీల ఆధారంగా అర్హులైన వారిని రెగ్యులర్ చేయాలని కోరారు. పులి లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.