హయత్‌నగర్, డిసెంబర్ 7: హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట అధికారపార్టీ నేతలు నానా హంగామా సృష్టించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పార్టీ శ్రేణుల కార్లను పోలీస్‌స్టేషన్ ఎదుట విజయవాడ జాతీయ రహదారిపై పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు గంటన్నర పాటు ఉద్యోగులు, వ్యాపారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు పోలీస్‌స్టేషన్ ఆవరణంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిండిపోయింది.
వివిధ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. తమ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యక్తిత్వాన్ని బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతూ కించపరుస్తున్నారని ఆరోపిస్తూ ఎంపీ, ఎమ్మెల్యే హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజు గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ఎస్, ఐటీ చట్టంలోని 336/1, 353/1 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సీఐ వెల్లడించారు.