గంభీరావుపేట, ఫిబ్రవరి 14: ‘ఎన్నికలు రాగానే కాంగ్రెసోళ్లు గ్రామాలకు వచ్చి హామీలు ఇస్తరు.. అమలు చేయాలని అడిగితే కాలయాపన చేస్తున్నరు.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై ఊసెత్తరు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరిట మిగతా గ్యారంటీ పథకాలకు మంగళం పాడుతరు’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఆయన చేపట్టిన ప్రజాహిత యాత్ర బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు లింగన్నపేట, కొత్తపల్లి గ్రామాల్లో సాగింది.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తేనే కాంగ్రెసోళ్లు గ్రామాలకు వస్తారని, గ్యారంటీ పథకాల పేరిట హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తారని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా డిసెంబర్ 9న ఇస్తానన్న రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? మహిళలకు రూ.2500 ఖాతాలో వేశారా? ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ యాత్రలో బీజేపీ నాయకులు రాణిరుద్రమ, రెడ్డబోయిన గోపి, ఎర్రం మహేశ్, గంట అశోక్ తదితరులు పాల్గొన్నారు.